తరువాత ఎవని హృదయము వాని రేపెనో, ఎవని మనస్సు వాని ప్రేరేపించెనో వారందరు వచ్చి, ప్రత్యక్షపు గుడారముయొక్క పనికొరకును దాని సమస్త సేవకొరకును ప్రతిష్ఠిత వస్త్రముల కొరకును యెహోవాకు అర్పణను తెచ్చిరి.
మోషే చేయవలెనని యెహోవా ఆజ్ఞాపించిన పనులన్నిటి కొరకు ఇశ్రాయేలీయులలో పురుషులేమి స్త్రీలేమి తెచ్చుటకు ఎవరి హృదయములు వారిని ప్రేరేపించునో వారందరు మనఃపూర్వకముగా యెహోవాకు అర్పణములను తెచ్చిరి.
ఆ పని చేసినవారిలో ప్రజ్ఞగల ప్రతివాడును మందిరమును పది తెరలతో చేసెను. అతడు వాటిని నీల ధూమ్ర రక్తవర్ణములుగల పేనిన సన్ననారతో చిత్రకారుని పనియైన కెరూబులు గలవాటినిగా చేసెను.