మరియు నీవు రెండు లేత పచ్చలను తీసికొని వాటిమీద ఇశ్రాయేలీయుల పేరులను, అనగా వారి జనన క్రమముచొప్పున
ఒక రత్నముమీద వారి పేళ్లలో ఆరును, రెండవ రత్నము మీద తక్కిన ఆరుగురి పేళ్లను చెక్కింపవలెను.
ముద్రమీద చెక్కబడినవాటివలె చెక్కెడివాని పనిగా ఆ రెండు రత్నములమీద ఇశ్రాయేలీయుల పేళ్లను చెక్కి బంగారు జవలలో వాటిని పొదగవలెను.
అప్పుడు ఇశ్రాయేలీయులకు జ్ఞాపకార్థమైన రత్నములనుగా ఆ రెండు రత్నములను ఏఫోదు భుజములమీద ఉంచవలెను అట్లు జ్ఞాపకముకొరకు అహరోను తన రెండు భుజములమీద యెహోవా సన్నిధిని వారి పేరులను భరించును.
మరియు బంగారు జవలను మేలిమి బంగారుతో రెండు గొలుసులను చేయవలెను;
సూత్రములవలె అల్లికపనిగా వాటిని చేసి అల్లిన గొలుసులను ఆ జవలకు తగిలింపవలెను.
మరియు చిత్రకారుని పనిగా న్యాయవిధాన పతకము చేయవలెను. ఏఫోదుపనివలె దాని చేయవలెను; బంగారుతోను నీల ధూమ్ర రక్తవర్ణములుగల నూలుతోను పేనిన సన్ననారతోను దాని చేయవలెను.
అది మడవబడి చచ్చౌకముగా నుండవలెను; అది జేనెడు పొడుగు జేనెడు వెడల్పుగలదైయుండవలెను.
దానిలో నాలుగు పంక్తుల రత్నములుండునట్లు రత్నముల జవలను చేయవలెను. మాణిక్య గోమేధిక మరకతములుగల పంక్తి మొదటిది;
పద్మరాగ నీల సూర్యకాంతములుగల పంక్తి రెండవది;
గారుత్మతము యష్మురాయి ఇంద్రనీలములుగల పంక్తి మూడవది;
రక్తవర్ణపురాయి సులిమానిరాయి సూర్యకాంతములుగల పంక్తి నాలుగవది. వాటిని బంగారు జవలలో పొదగవలెను.
ఆ రత్నములు ఇశ్రాయేలీయుల పేరులుగలవై వారి పేరులచొప్పున పండ్రెండుండవలెను. ముద్రమీద చెక్కినవాటివలె వారిలో ప్రతివాని పేరు చొప్పున పండ్రెండు గోత్రముల పేరులు ఉండవలెను.