మరియు నీవు మేలిమి బంగారురేకుచేసి ముద్ర చెక్కునట్లు దానిమీద యెహోవా పరిశుద్ధుడు అను మాట చెక్కవలెను.
అది పాగామీద ఉండునట్లు నీలి సూత్రముతో దాని కట్టవలెను. అది పాగా ముందటి వైపున ఉండవలెను.
తమ పరిశుద్ధమైన అర్పణలన్నిటిలో ఇశ్రాయేలీయులు ప్రతిష్ఠించు పరిశుద్ధమైనవాటికి తగులు దోషములను అహరోను భరించునట్లు అది అహరోను నొసట ఉండవలెను; వారు యెహోవా సన్నిధిని అంగీకరింపబడునట్లు అది నిత్యమును అతని నొసట ఉండవలెను.
మరియు సన్ననారతో చొక్కాయిని బుట్టాపనిగా చేయవలెను. సన్ననారతో పాగాను నేయవలెను; దట్టిని బుట్టాపనిగా చేయవలెను.
అతని తలమీద పాగాను పెట్టి, ఆ పాగామీదను అతని నొసట పరిశుద్ధకిరీటముగా బంగారు రేకును కట్టెను. ఇట్లు యెహోవా మోషేకు ఆజ్ఞాపించెను.