ఇశ్రాయేలీయులు యొర్దానుకు తూర్పుగా అవతలనున్న అర్నోనులోయ మొదలుకొని హెర్మోను కొండ వరకు తూర్పునందలి మైదానమంతటిలో హతముచేసి వారి దేశములను స్వాధీనపరచుకొనిన రాజులు ఎవరనగా
అమోరీయుల రాజైన సీహోను అతడు హెష్బోనులో నివసించి, అర్నోను ఏటి తీరము నందలి అరోయేరునుండి, అనగా ఆ యేటిలోయ నడుమనుండి గిలాదు అర్ధభాగమును అమ్మోనీయులకు సరిహద్దుగానున్న యబ్బోకు ఏటి లోయవరకును, తూర్పు దిక్కున కిన్నెరెతు సముద్రమువరకును, తూర్పు దిక్కున బెత్యేషిమోతు మార్గమున ఉప్పు సముద్రముగా నున్న
అరాబా సముద్రమువరకును, దక్షిణదిక్కున పిస్గాకొండచరియల దిగువనున్న మైదానము వరకును ఏలినవాడు.
ఇశ్రాయేలీయులు బాషానురాజైన ఓగుదేశమును పట్టుకొనిరి. అతడు రెఫాయీయుల శేషములో నొకడు. అతడు అష్తారోతులోను ఎద్రెయిలోను నివసించి గెషూరీయుల యొక్కయు మాయకాతీయుల యొక్కయు సరిహద్దువరకు బాషాను అంతటిలోను సల్కాలోను
హెర్మోనులోను హెష్బోనురాజైన సీహోను సరిహద్దు వరకు గిలాదు అర్దభాగములోను రాజ్యమేలినవాడు.
యెహోవా సేవకుడైన మోషేయు ఇశ్రాయేలీయులును వారిని హతముచేసి, యెహోవా సేవకుడైన మోషే రూబేనీయులకును గాదీయులకును మనష్షే అర్ధగోత్రపు వారికిని స్వాస్థ్యముగా దాని నిచ్చెను.
యొర్దానుకు అవతల, అనగా పడమటిదిక్కున లెబానోను లోయలోని బయల్గాదు మొదలుకొని శేయీరు వరకునుండు హాలాకు కొండ వరకు యెహోషువయు ఇశ్రాయేలీయులును జయించిన దేశపురాజులు వీరు. యెహోషువ దానిని ఇశ్రాయేలీయులకు వారి గోత్రముల వారి చొప్పున స్వాస్థ్యముగా ఇచ్చెను.
మన్యములోను లోయలోను షెఫేలాప్రదేశములోను చరియలప్రదేశములలోను అరణ్యములోను దక్షిణ దేశములోను ఉండిన హిత్తీయులు అమోరీయులు కనానీయులు పెరిజ్జీయులు హివ్వీయులు యెబూసీయులను వారి రాజులను ఇశ్రాయేలీయులు పట్టుకొనిరి. వారెవరనగా యెరికో రాజు
బేతేలునొద్దనున్న హాయి రాజు, యెరూషలేమురాజు,
హెబ్రోను రాజు, యర్మూతు రాజు,
లాకీషు రాజు, ఎగ్లోను రాజు,
గెజెరు రాజు, దెబీరు రాజు,
గెదెరు రాజు, హోర్మా రాజు,
అరాదు రాజు, లిబ్నా రాజు,
అదుల్లాము రాజు, మక్కేదా రాజు,
బేతేలు రాజు, తప్పూయ రాజు,
హెపెరు రాజు, ఆఫెకు రాజు,
లష్షారోను రాజు, మాదోను రాజు,
హాసోరు రాజు, షిమ్రోన్మెరోను రాజు,
అక్షాపు రాజు, తానాకు రాజు,
మెగిద్దో రాజు, కెదెషు రాజు.
కర్మెలులొ యొక్నెయాము రాజు, దోరు మెట్టలలో దోరు రాజు,
గిల్గాలులోని గోయీయుల రాజు, తిర్సా రాజు,
ఆ రాజులందరి సంఖ్య ముప్పది యొకటి.