అయితే యెహోవా సముద్రముమీద పెద్ద గాలి పుట్టింపగా సముద్రమందు గొప్ప తుపాను రేగి ఓడ బద్దలైపోవుగతి వచ్చెను.
కాబట్టి నావికులు భయపడి, ప్రతివాడును తన తన దేవతను ప్రార్థించి, ఓడ చులకనచేయుటకై అందులోని సరకులను సముద్రములో పారవేసిరి. అప్పటికి యోనా, ఓడ దిగువభాగమునకు పోయి పండుకొని గాఢ నిద్రపోయియుండెను
అప్పుడు ఓడనాయకుడు అతని యొద్దకు వచ్చి, ఓయీ నిద్రబోతా, నీకేమివచ్చినది? లేచి నీ దేవుని ప్రార్థించుము, మనము చావకుండ ఆ దేవుడు మనయందు కనికరించునేమో అనెను.