యెహోవా మోషేను పిలిచి ప్రత్యక్షపు గుడారములోనుండి అతనికీలాగు సెలవిచ్చెను.
నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము మీలో ఎవరైనను యెహోవాకు బలి అర్పించునప్పుడు, గోవులమందలోనుండిగాని గొఱ్ఱల మందలోనుండి గాని మేకలమందలోనుండి గాని దానిని తీసికొనిరావలెను.
అతడు దహనబలిరూపముగా అర్పించునది గోవులలోనిదైనయెడల నిర్దోషమైన మగదానిని తీసికొనిరావలెను. తాను యెహోవా సన్నిధిని అంగీకరింపబడునట్లు ప్రత్యక్షపు గుడారముయొక్క ద్వారమునకు దానిని తీసికొనిరావలెను.