Hits: 1619
Print
రచయిత: కె విద్యా సాగర్

40:1, 40:2-4, 40:5, 40:6,7, 40:8, 40:9-13, 40:14,15, 40:16-19, 40:20, 40:21,22, 40:23

ఆదికాండము 40:1 అటుపిమ్మట ఐగుప్తురాజు యొక్క పానదాయకుడును భక్ష్యకారుడును తమ ప్రభువైన ఐగుప్తురాజు ఎడల తప్పుచేసిరి.

ఈ వచనంలో ఫరోయొక్క పానదాయకుడూ భక్ష్యకారుడూ అతనియెడల తప్పు చేసినట్టు మనం చూస్తాం.‌ వారు చేసిన ఆ తప్పేంటో ఇక్కడ మనకు వివరించబడలేదు. బహుశా వారు రాజు తీసుకునే ఆహార పానీయాల‌ విషయంలో ఆ తప్పు చేసారేమో?. ఏదేమైనప్పటికీ ఈ సంఘటనకూ యోసేపు చెరసాల నుండి విడుదల అవ్వడానికీ ప్రాముఖ్యమైన సంబంధం ఉంది.

రోమా 8: 28 దేవుని ప్రేమించువారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడినవారికి, మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని యెరుగుదుము.

ఆదికాండము 40:2-4 గనుక ఫరో పానదాయకుల అధిపతియు భక్ష్యకారుల అధిపతియునైన తన యిద్దరు ఉద్యోగస్థుల మీద కోపపడి వారిని చెరసాలలోనుంచుటకై రాజసంరక్షక సేనాధిపతికి అప్పగించెను. అది యోసేపు బంధింపబడిన స్థలము. ఆ సేనాధిపతి వారిని యోసేపు వశము చేయగా అతడు వారికి ఉపచారము చేసెను. వారు కొన్నిదినములు కావలిలోనుండిన తరువాత-

ఈ వచనంలో ఫరో పానదాయకుల అధిపతినీ భక్ష్యకారుల అధిపతినీ రాజసంరక్షక సేనాధిపతియైన పోతిఫరుకు (ఆదికాండము 39:1) అప్పగించినట్టు, అతను వారిని చెరశాలలోని యోసేపు వశం చేసినట్టు మనం చూస్తాం. ఈ పోతిఫరు తన భార్య మాటను బట్టి యోసేపును చెరసాలలో వేయించినా అతను నిజంగా ఆ తప్పు చేసాడని నమ్మియుండకపోవచ్చు, అందుకే ఇంకా యోసేపుపై కనికరం చూపిస్తున్నాడు. దీనంతటిలో మనకు దేవుని సార్వభౌమత్వం కనిపిస్తుంది. ఫరో యొక్క ఇద్దరు ఉద్యోగస్తులు పోతిఫరును బట్టి యోసేపు వశం చెయ్యబడడం ద్వారా దేవుడు యోసేపును ఐగుప్తుకు ప్రధానిని చేసే తన చిత్తాన్ని నెరవేర్చుకుంటున్నాడు.

ఇక యోసేపు జీవితాన్ని పరిశీలిస్తే అతను మొదటినుండీ దేవుణ్ణి ప్రేమించి చెడుతనాన్ని విసర్జించాడు. తన అన్నల కోపానికి గురై బానిసగా అమ్మబడి తన కుటుంబానికి దూరమయ్యాడు. అయినప్పటికీ కృంగిపోకుండా పోతిఫరు ఇంట్లో నమ్మకంగా పనిచేస్తుంటే అక్కడ కూడా తన యజమానుడి భార్య కారణంగా చెరశాలలో వేయబడ్డాడు. ఈవిధంగా అతను దేవునిపట్ల భయభక్తులతో సక్రమంగా నడుచుకుంటున్న ప్రతీసారీ శ్రమలనే ఎదుర్కొన్నాడు. కానీ ఈ కారణాలవల్ల ఎక్కడా దేవుణ్ణి నిందించడం లేదు, బెంగతో తన‌ బాధ్యతలను కూడా విస్మరించడం లేదు. అందుకే అతను చెరసాలలో కూడా తనకు అప్పగించబడిన బాధ్యతను నిజాయితీగా నిర్వర్తిస్తున్నాడు.

కానీ సాధారణంగా చాలామంది విశ్వాసులు తాము నిజాయితీగా జీవిస్తున్నప్పటికీ‌ పరిస్థితులు వారికి ప్రతికూలంగా మారుతుంటే చాలా కృంగిపోతుంటారు, కొందరైతే దేవుణ్ణి కూడా నిందిస్తుంటారు. మరికొందరు తమ‌ బాధ్యతలను నిర్వర్తించలేక తొట్రిల్లుతుంటారు. అలాంటివారందరూ యోసేపు జీవితాన్ని బట్టి ధైర్యం తెచ్చుకోవాలి.

సామెతలు 24: 10 శ్రమదినమున నీవు క్రుంగినయెడల నీవు చేతకానివాడవగుదువు.

ఆదికాండము 40:5 వారిద్దరు, అనగా చెరసాలలో బంధింపబడిన ఐగుప్తురాజు యొక్క పానదాయకుడును, భక్ష్యకారుడును ఒక్కటే రాత్రియందు కలలు కనిరి. ఒక్కొక్కడు వేరు వేరు భావముల కల కనెను.

ఈ వచనంలో ఫరోయొక్క ఇద్దరు ఉద్యోగస్తులూ వేరువేరు భావాలున్న కలలను‌ కన్నట్టు మనం చూస్తాం. బైబిల్ గ్రంథంలో దేవుణ్ణి ఎరుగని అన్యులకు సైతం ఆయన కలలు రప్పించాడు. కారణం: వారిద్వారా ఏదో ప్రత్యక్షతను తెలియచెయ్యడానికి కాదుకానీ తమ మధ్య ఉన్న ప్రవక్తను ప్రజలు గుర్తించి ఘనపరచడానికే అలా చేసాడు. ఉదాహరణకు ఆయన నెబుకద్నెజరుకు కలలను రప్పించి బబులోను సామ్రాజ్యంలో దానియేలు ఘనపరచబడేలా చెయ్యడం మనకు దానియేలు గ్రంథంలో కనిపిస్తుంది. యోసేపు విషయంలో కూడా అలా జరిగేందుకే ఆయన ఆ ఉద్యోగస్తులకు కలలను రప్పించాడు.

ఆదికాండము 40:6,7 తెల్లవారినప్పుడు యోసేపు వారి యొద్దకు వచ్చి వారిని చూడగా వారు చింతాక్రాంతులై యుండిరి. అతడు ఎందుచేత నేడు మీ ముఖములు చిన్నబోయియున్నవని తన యజమానుని యింట తనతో కావలియందున్న ఫరో ఉద్యోగస్థులనడిగెను.

ఈ వచనాలలో యోసేపు అతని వశం చెయ్యబడిన ఖైదీల పట్ల ఎంతటి బాధ్యతతో మృదుత్వంతో వ్యవహరిస్తున్నాడో మనం చూస్తాం. అతను కేవలం వారికి ఉపచారం చెయ్యడమే కాదు, వారి ముఖంలో కనిపించే విచారాన్ని బట్టి ‌కూడా స్పందిస్తూ కారణం తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. విశ్వాసులు కూడా తాము నియమించబడ్డ ప్రతీ బాధ్యతలోనూ యోసేపులా నిబద్ధతతో వ్యవహరించాలి. ఎందుకంటే మనం నియమించబడిన ప్రతీ బాధ్యతలోనూ‌ చేసే సేవ మనుష్యుల కోసం కాదు దేవుని కోసమే‌ చేస్తున్నాము. అందుకే "మనుష్యులకు చేసినట్టుకాక ప్రభువునకు చేసినట్టే యిష్టపూర్వకముగా సేవ చేయుడి" (ఎఫెసీ 6:7) అని రాయబడింది.

ఆదికాండము 40:8 అందుకు వారు మేము కలలు కంటిమి. వాటి భావము చెప్పగలవారెవరును లేరని అతనితోననగా యోసేపు వారిని చూచి భావములు చెప్పుట దేవుని అధీనమే గదా. మీరు దయచేసి ఆ కలలు నాకు వివరించి చెప్పడనెను.

ఈ వచనంలో ఆ ఇద్దరు ఉద్యోగస్తులూ తాము కనిన కలల భావం చెప్పేవారు ఇక్కడ (చెరసాలలో) ఎవరూ లేరని, అందుకే మేము విచారంతో ఉన్నామని యోసేపుకు బదులివ్వడం మనం చూస్తాం. ఐగుప్తు దేశంలో కలలకు భావం చెప్పే జ్ఞానులకు కొదువేం లేదు. కానీ వారు చెరశాలలో ఉన్నారు కాబట్టి ఆవిధంగా మాట్లాడుతున్నారు.

అలానే యోసేపు వారితో కలల భావం దేవుని ఆధీనమని పలకడం మనం చూస్తున్నాం. ఇలాంటి మాటలే దానియేలు కూడా నెబుకద్నెజరుతో పలికాడు (దానియేలు 2:27,28). కారణం; ఆయన మాత్రమే దేనికైనా సరైన సమాధానం ఇవ్వగలడు. అందుకే అతను ఆయనను ఘనపరిచేలా ఈమాటలు పలుకుతున్నాడు.‌

ఆదికాండము 40:9-13 అప్పుడు పానదాయకుల అధిపతి యోసేపును చూచిన కలలో ఒక ద్రాక్షావల్లి నా యెదుట ఉండెను. ఆ ద్రాక్షావల్లికి మూడు తీగెలుండెను, అది చిగిరించినట్టు ఉండెను. దాని పువ్వులు వికసించెను. దాని గెలలు పండి ద్రాక్షఫలములాయెను. మరియు ఫరో గిన్నె నా చేతిలో ఉండెను. ఆ ద్రాక్షఫలములు నేను పట్టుకొని ఫరో గిన్నెలో వాటిని పిండి ఆ గిన్నె ఫరో చేతికిచ్చితినని తన కలను అతనితో వివరించి చెప్పెను. అప్పుడు యోసేపుదాని భావమిదే. ఆ మూడు తీగెలు మూడు దినములు. ఇంక మూడు దినములలోగా ఫరో నీ తలను పైకెత్తి నీ ఉద్యోగము నీకు మరల ఇప్పించును. నీవు అతనికి పానదాయకుడవై యున్ననాటి మర్యాద చొప్పున ఫరో గిన్నెను అతని చేతికప్పగించెదవు.

ఈ వచనాలలో పానదాయకుల అధిపతి యోసేపుకు తన కలను వివరించడం, యోసేపు అతనికి ఆ కల భావాన్ని తెలియచెయ్యడం‌ మనం చూస్తాం. కాబట్టి ఇక్కడ యోసేపును దేవుని ప్రవక్తగా మనం‌ గమనిస్తున్నాం.

ఆదికాండము 40:14-15 కాబట్టి నీకు క్షేమము కలిగినప్పుడు నన్ను జ్ఞాపకము చేసికొని నాయందు కరుణించి ఫరోతో నన్నుగూర్చి మాటలాడి యీ యింటిలోనుండి నన్ను బయటికి రప్పించుము. ఏలయనగా నేను హెబ్రీయుల దేశములోనుండి దొంగిలబడితిని, అది నిశ్చయము. మరియు ఈ చెరసాలలో నన్ను వేయుటకు ఇక్కడ సహా నేనేమియు చేయలేదని అతనితో చెప్పెను.

ఈ వచనాలలో యోసేపు పానదాయకుల అధిపతికి కల భావాన్ని వివరించిన తర్వాత తాను ఈ చెరశాలలో ఉండే తప్పు ఏదీ చెయ్యలేదు కాబట్టి నీకు ‌నీ ఉద్యోగం మరలా వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని మనవి చెయ్యడం‌ మనం చూస్తాం. ఈ మాటల ద్వారా యోసేపు ఎంత నిజాయితీ పరుడో మరోసారి గమనిస్తున్నాం. అతను దేవుని జ్ఞానం చొప్పున కలకు భావం చెప్పాడు కాబట్టి ఆ కృతజ్ఞతతో తనను విడుదల చెయ్యించాలని (శిక్షను తప్పించుకోవాలని) కోరలేదు. అతను చెరసాలలో ఉండడానికి ఏ నేరం చెయ్యకపోయినా ఒక దుర్మార్గురాలి అన్యాయపు ఆరోపణ వల్లే అతనికి ఆ పరిస్థితి వచ్చింది కాబట్టి, నిర్దోషినైన తనను జ్ఞాపకం చేసుకోమని మాత్రమే కోరుకుంటున్నాడు. ఎందుకంటే యోసేపు చెరసాల నుండి విడుదల చెయ్యబడడానికి అర్హుడు.

కొందరు విశ్వాసులు మాత్రం ఇలాంటి నిజాయితీని‌ తృణీకరిస్తూ తాము ఎవరికైనా ఉపకారం చేసినప్పుడు, దానికి ప్రతిఫలంగా అర్హం కాని ప్రత్యుపకారం ఆశిస్తుంటారు. ఇక్కడ యోసేపులో మనం గమనించవలసిన మరో విషయం ఏంటంటే అతను తన పరిస్థితి గురించి పానదాయకుల అధిపతికి వివరిస్తూ దానికి కారణమైన ఎవరినీ నిందించడం లేదు. విశ్వాసులు ఇలాంటి క్షమాగుణం కలిగుండాలి.

ఆదికాండము 40:16-19 అతడు తెలిపిన భావము మంచిదని భక్ష్యకారుల అధిపతి చూచి అతనితోనిట్లనెను నేనును కల కంటిని. ఇదిగో తెల్లని పిండివంటలుగల మూడు గంపలు నా తల మీద ఉండెను. మీదిగంపలో ఫరో నిమిత్తము సమస్తవిధములైన పిండివంటలు ఉండెను. పక్షులు నా తలమీదనున్న ఆ గంపలోనుండి వాటిని తీసికొని తినుచుండెను. అందుకు యోసేపు దాని భావమిదే. ఆ మూడు గంపలు మూడు దినములు ఇంక మూడు దినములలోగా ఫరో నీ మీదనుండి నీ తలను పైకెత్తి మ్రానుమీద నిన్ను వ్రేలాడదీయించును. అప్పుడు పక్షులు నీ మీద నుండి నీ మాంసమును తినివేయునని ఉత్తరమిచ్చెను.

ఈ వచనాలలో తోటి ఉద్యోగికి మంచి భావం కలిగిన కల వచ్చిందని గమనించిన భక్ష్యకారుల అధిపతి యోసేపుకు తన కలను కూడా‌ వివరించడం, యోసేపు అతనికి ప్రతికూలమైన భావం చెప్పడం మనం చూస్తాం. ఇక్కడ యోసేపు దేవుడు తనకు ఏం బయలుపరిచాడో దానిని ఉన్నది ఉన్నట్టుగా అతనికి తెలియచేసాడు. ఇలాంటి భావం చెబితే అతను నొచ్చుకుంటాడేమో అనే మొహమాటం కానీ పై అధికారులకు లేనిపోనివి చెప్పి నన్నేమన్నా ఇబ్బందిపెడతాడేమో అనే భయం కానీ అతనికి లేవు. ఎందుకంటే దేవుడు ఏది బయలుపరిస్తే అది ప్రకటించడమే తన పని. "నరపుత్రుడా, నీవు బ్రహ్మదండి చెట్లలోను ముండ్లతుప్పలలోను తిరుగుచున్నావు, తేళ్ల మధ్య నివసించుచున్నావు. అయినను ఆ జనులకు భయపడకుము, వారి మాటలకును భయపడకుము. వార తిరుగు బాటు చేయువారు వారికి భయపడకుము. వారు తిరుగు బాటుచేయువారు గనుక వారు వినినను వినకపోయినను నేను సెలవిచ్చిన మాటను నీవు వారికి తెలియజేయుము" (యెహెజ్కేలు 2:6-8) అనేది ఆయన ప్రవక్తలకు చేసిన హెచ్చరిక.

కానీ ఈరోజుల్లో చాలామంది బోధకులు కఠినమైన మాటలు చెబితే విశ్వాసులు ఎక్కడ సంఘానికి రారో ఎక్కడ కానుకలు వెయ్యరో అనే ఆందోళనతో విశ్వాసుల తప్పిదాలను ఖండించడం మానేసి వారిని సంతోషపెట్టే తియ్యని మాటలనే ఉపయోగిస్తున్నారు వారంతా దేవునికి కాదు తమ కడుపుకే దాసులు (రోమా 16: 18).

కాబట్టి మనం యోసేపులా మరియు "బోధకుడా నీవు ఎవనినీ లక్ష్యపెట్టవనియూ మోమాటము లేక బోధించేవాడివనీ మేము ఎరుగుదుమంటూ" పరిసయ్యులు ఎవరి గురించైతే సాక్ష్యమిచ్చారో (మత్తయి 22:16) ఆ యేసుక్రీస్తులా సత్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా బోధించగలగాలి.

ఆదికాండము 40:20 మూడవ దినమందు జరిగినదేమనగా, ఆ దినము ఫరో జన్మదినము గనుక అతడు తన సేవకులకందరికి విందు చేయించి వారి నడుమ పానదాయకుల అధిపతి తలను భక్ష్యకారుల అధిపతి తలను పైకెత్తి-

ఈ వచనంలో ఫరో యొక్క జన్మదిన వేడుక గురించి రాయబడినట్టు మనం చూస్తాం. బైబిల్ గ్రంథంలో జన్మదిన వేడుకల గురించి ఇక్కడా మరియు యోహాను తలకొట్టించిన హేరోదు సందర్భంలో మాత్రమే కనిపిస్తుంది తప్ప భక్తులెవరూ ఇలాంటి వేడుకలు చేసుకున్నట్టు మనం చూడలేము. దీనికి ఒక ప్రత్యేకమైన కారణం ఉంది, హెబ్రీయులు జన్మదిన వేడుకలను, విగ్రహారాధనగా భావించేవారు. దీనిగురించి, యూదా చారిత్రకారుడైన ప్లేవియస్ జోసెఫెస్ "Against Apion" అనే తన పుస్తకం, no:2, section:25 లో తెలియచేసాడు.

"Dr. Augustus neander" గారు కూడా ప్రారంభ మూడు శతబ్దాలలో క్రైస్తవులు పుట్టినరోజు వేడుకలను జరుపుకోలేదని, తాను రాసిన "The History of the Christian Religion and Church During the First Three Centuries" అనే పుస్తకంలో వెల్లడించాడు.

ఇక ఫరో జన్మదిన వేడుక గురించి మనం ఆలోచిస్తే ప్రాచీనకాలంలో ఐగుప్తీయులు అనేకమంది దేవుళ్ళను పూజిస్తూ వారికి పుట్టినరోజు వేడుకలను నిర్వహించేవారు. వారు పూజించే దేవుళ్ళలో "RAA" అని పిలవబడే సూర్యదేవుడు ఒకరు, ఐగుప్తుకు ఇతనే ప్రారంభ ఫరో అని వారు నమ్మేవారు. అతని తర్వాత ఓసరిస్, మరియు ఐసిస్ ల కుమారుడు హారస్ అనీ తర్వాత వచ్చిన ఫరోలందరూ ఇతని ద్వారా "RAA" యొక్క సంతానమని భావిస్తూ ఫరోలను దైవాంశ సంభూతులుగా ప్రత్యక్షదైవాలుగా కొలిచేవారు. అందుకే దేవుళ్ళకు చేసే పుట్టినరోజు వేడుకలను వీరు ఫరోలకు కూడా చేసేవారు. మనకు పై సందర్భంలో కనిపిస్తున్న ఫరో పుట్టినరోజు వేడుకకు కారణం ఇదే. తర్వాత కాలంలో పెద్దమనుషులూ సామాన్య ప్రజలూ దీనిని అలవాటు చేసుకున్నారు.

అలాగని పుట్టినతేదీని ‌నమోదు చెయ్యడం, మన జీవితంలో మరో సంవత్సరాన్ని అనుగ్రహించిన దేవునికి ఆరోజు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం పాపమని నేను చెప్పడం లేదు. ఎందుకంటే హెబ్రీయులు&ప్రారంభ క్రైస్తవ సంఘం పుట్టినరోజు వేడుకలు చేసుకోలేదనేది వాస్తవమే అయినా వారు ఆ రోజును నమోదు చెయ్యలేదని కానీ దానిని శుభదినంగా ఎంచలేదని కానీ మనం చెప్పలేం. ఉదాహరణకు భక్తుల పుట్టినరోజు దినం నమోదు చెయ్యబడకుంటే (జ్ఞాపకం ఉంచుకోకపోతే) బైబిల్ ప్రారంభంలోనే ఫలానా వ్యక్తి ఇన్ని సంవత్సరాలు జీవించాడని ఎలా రాయబడింది? (ఆదికాండము 7:11).

అలానే యోబు "ఆ తరువాత యోబు మాటలాడ మొదలు పెట్టి తాను పుట్టినదినమును శపించెను" (యోబు 3:1) అని రాయబడింది. తనకు కలిగిన శ్రమను బట్టి తాను పుట్టిన దినాన్ని శపిస్తున్నాడంటే అంతకుముందు అతను ఆరోజును తనకు దీవెనకరమైన దినంగా ఎంచాడనేగా. కాబట్టి హెబ్రీయులూ ప్రారంభ క్రైస్తవ సంఘస్తులూ పుట్టినరోజు వేడుకలను జరుపుకోకపోవడానికి ఐగుప్తీయులూ ఇతర అన్యజాతులవారు ఆ వేడుకల్లో చొప్పించిన వారిమత సంబంధమైన ఆచారాలే కారణమని గ్రహించాలి. ఉదాహరణకు అన్యులు తమ పిల్లలు పుట్టిన తారీఖునూ సమయాన్నీ జ్యోతిష్యం కోసం నమోదు చేస్తుంటారు. ఈ మెలకువతో మనం ఆలాంటి ఆచారాలను విస్మరిస్తూ మన పుట్టినరోజు వేడుకలను దేవునికి కృతజ్ఞతగా (గృహకూడిక, సంఘస్తులకు, పేదలకు విందు) నిర్వహించడం తప్పుకాదు.

అలానే పుట్టినరోజు వేడుకల్లో చొప్పించబడిన కొన్ని‌ మతసంబంధమైన ఆచారాలను చూద్దాం. అప్పటి ప్రజల నమ్మకం ప్రకారం, పుట్టినరోజుతో ఆ వ్యక్తి మరో సంవత్సరంలోకి అడుగుపెడుతున్నాడు ఇది ఆ వ్యక్తిలో కొంచెం ఉద్రిక్తత నెలకొల్పుతుంది. ఎందుకంటే ఆ సంవత్సరం అతనికి మంచి జరగొచ్చు లేదా చెడు కూడా జరగవచ్చు. కాబట్టి వారు ప్రతీమనిషిపైనా కొన్ని దుష్టశక్తులూ మంచిశక్తులూ పనిచేస్తాయని ఒకవేళ ఆ పుట్టినరోజున ఆ వ్యక్తియొక్క బంధుమిత్రులంతా కలసి అతని మంచిని కోరుకుంటే దుష్టశక్తుల ప్రభావం తగ్గి, మంచి జరుగుతుంద‌ని భావించేవారు. ఈవిధంగా "Birthday Wishes" అనేవి ఉనికిలోకి వచ్చాయి. ఈ విషయాలు మనం, "Funk & Wagnalls Standard Dictionary of Folklore Mythology and Legends Volume 1" లో చూడవచ్చు.

మనం ఇలాంటి నమ్మకంతో కాకుండా మన సంబంధిత వ్యక్తి మంచి కోరుకోవడం మన బాధ్యత కాబట్టి, ఆ క్రమంలో‌ భాగంగా అతడిని wish చెయ్యడం, చేయించుకోడంలో ఇబ్బంది లేదు. మన wish వల్ల దుష్టశక్తుల ప్రభావం పోయి మంచి శక్తుల ప్రభావం పడుతుందని మనం నమ్మడం లేదు. మనం షాలోం అని ఎలాగైతే చెబుతామో అక్కడ కూడా ఆ వ్యక్తికి అదే చెబుతున్నాము.

అదేవిధంగా గ్రీకులు చాలామంది‌ దేవుళ్ళను పూజించేవారు, వారిలో "artemis" (అర్తమీ దేవి) ఒకరు. ఈమెను వారు చంద్రదేవతగా భావించేవారు. చంద్రుడు ప్రతీనెలా కనుమరుగై మళ్ళీ కనిపిస్తాడు కాబట్టి వారు ఆ దేవతకు నెలకోసారి పుట్టినరోజును నిర్వహించి (6th) ఆమె దేవాలయంలోకి Honey cake తీసుకెళ్ళేవారు. చంద్రుడు గుండ్రంగా కాంతివంతంగా ఉంటాడు కాబట్టి వారు ఆ Cake ను గుండ్రంగా‌ చేసి దానిపై కొవ్వొత్తులనూ వెలిగించేవారు‌. ఈవిధంగా పుట్టినరోజు వేడుకల్లో Cake లూ కొవ్వొత్తులూ వెలిగించే ఆచారం మొదలైంది. ఆ కొవ్వొత్తులలు ఒకేసారి ఊదేస్తే ఆ వ్యక్తియొక్క కోరికలు తీరతాయనే నమ్మకం కూడా వారిలో ఉండేది. ఈ విషయాలను మనం "Childcraft: The How and Why Library, Holidays & Birthdays vol 9" అనే పుస్తకంలో చూడొచ్చు. కాబట్టి విశ్వాసులు దేవునికి కృతజ్ఞతగా జరుపుకునే పుట్టినరోజు వేడుకల్లో Cake పైన కొవ్వొత్తులు వెలిగించి వాటిని ఊదడం వంటివి చెయ్యకుండా ఉండడం మంచిది.

ఇక సందర్భంలోనికి వెళ్తే ఇక్కడ ఫరో పానదాయకుల అధిపతి తలనూ భక్ష్యకారుల అధిపతి తలనూ పైకెత్తినట్టు మనం చూడగలం. ఆ మాటలు వారిని విచారణలో నిలబెట్టడాన్ని సూచిస్తున్నాయి. ఆ కాలంలో నేరస్థునికి తీర్పుతీర్చేటప్పుడు ఆ వ్యక్తి అందరికీ కనిపించేలా ఎత్తైన ప్రదేశంలో నిలబెట్టేవారు.

ఆదికాండము 40:21,22 పానదాయకుల అధిపతి ఉద్యోగము మరల అతనికిచ్చెను గనుక అతడు ఫరోచేతికి గిన్నెనిచ్చెను. మరియు యోసేపు వారికి తెలిపిన భావము చొప్పున భక్ష్యకారుల అధిపతిని వ్రేలాడదీయించెను.

ఈ వచనాలలో ఫరో యోసేపు చెప్పిన కలభావం చొప్పున పానదాయకుల అధిపతికి తన ఉద్యోగం మరలా ఇవ్వడం, భక్ష్యకారుల అధిపతిని ఉరితియ్యడం మనం చూస్తాం. అయితే ఈ అధ్యాయ ప్రారంభ వచనంలో పానదాయకుల అధిపతి, భక్ష్యకారుల అధిపతి ఇద్దరూ తప్పు చేసారని రాయబడింది. కానీ ఇక్కడ ఫరో వారిలో ఒకరిని మాత్రమే శిక్షించి మరొకరిని కరు‌ణించాడు. ఇది అప్పటి కొందరి రాజుల పాలనా పద్ధతిని సూచిస్తుంది (దానియేలు 5: 19).

అదేవిధంగా దీనివెనుక దేవుని సార్వభౌమ నిర్ణయం మనకు కనిపిస్తుంది. ఫరో పానదాయకుల అధిపతిని కరుణించి త‌న పదవిని తనకు అప్పగించబట్టే తదుపరికాలంలో అతను‌ యోసేపు గురించి రాజుకు తెలియచేసి, చెరశాల నుండి అతడిని బయటకు రప్పించాడు. కాబట్టి ఏదీ కూడా యాదృచ్చికంగా జరగవు, అన్నీ దేవుని సార్వభౌమ నిర్ణయం ప్రకారమే జరుగుతుంటాయి. అందుకే "ఆయన తన చిత్తానుసారముగా చేసిన నిర్ణయము చొప్పున సమస్త కార్యములను జరిగించుచున్నాడు" (ఎఫెసీ 1: 12) అని స్పష్టంగా రాయబడింది.

ఆదికాండము‌ 40:23 అయితే పానదాయకుల అధిపతి యోసేపును జ్ఞాపకము చేసికొనక అతని మరచిపోయెను.

ఈ వచనంలో పానదాయకుల అధిపతి తనకు మేలుకలిగినప్పుడు యోసేపు చేసిన ఉపకారాన్ని మరచిపోవడం మనం చూస్తాం. విశ్వాసులైతే ఇలా కృతజ్ఞతాహీనులుగా ఉండకూడదు. అయితే అతను అలా మరచిపోవడం వెనుక కూడా దేవునిసార్వభౌమత్వం మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ప్రస్తుతం అతను యోసేపును జ్ఞాపకం చేసుకుని చెరశాల నుండి విడిపిస్తే బహుశా అతను కనానులోని తండ్రి ఇంటికి వెళ్ళిపోయేవాడు. ఫరో ముందు నిలబడి ఐగుప్తుకు ప్రధానిగా మారేవాడు కాదు. కాబట్టి పై వచనంలో వివరించినట్టుగా సమస్తమూ ఆయన నిర్ణయం చొప్పునే జరుగుతుంది. అదంతా ఆయన పిల్లల మేలుకే.

రోమా 8:28 దేవుని ప్రేమించువారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి, మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని యెరుగుదుము.