Hits: 69
Print
రచయిత: కె విద్యా సాగర్

సంఖ్యాకాండము 4:1-3 యెహోవా మోషే అహరోనులకు ఈలాగు సెలవిచ్చెను. నీవు లేవీయులలో కహాతీయులను వారి వారి వంశముల చొప్పునను వారి వారి పితరుల కుటుంబముల చొప్పునను ముప్పది యేండ్లు మొదలుకొని, యేబది యేండ్లవరకు ప్రాయము కలిగి, ప్రత్యక్షపు గుడారములో పనిచేయుటకు సేనగా చేరగలవారందరి సంఖ్యను వ్రాయించుము.

ఈ వచనాలలో దేవుడు మోషే అహరోనులకు లేవీ కుమారుడైన కహాతు వంశంలో కుటుంబాలను బట్టి 30 యేళ్ళు మొదలుకొని 50 యేళ్ళ వయస్సు ఉన్నవారిని లెక్కించమని ఆజ్ఞాపించడం మనం చూస్తాం. కారణం; "ప్రత్యక్షపు గుడారములో పనిచేయుటకు సేనగా" వారిని లెక్కించమంటున్నాడు.‌ 30 యేళ్ళ నుండి 50 యేళ్ళ వయస్సు గలవారి వరకే ఎందుకు లెక్కించమంటున్నాడంటే; సాధారణంగా ఆ వయస్సు గలవారు మానసికంగానూ శారిరకంగానూ బలంగా ఉంటారు. ప్రత్యక్షగుడారపు సేవ ఎంతో నియమనిబద్ధతలతోనూ మరియు కష్టంతోనూ కూడుకున్నది కాబట్టి ఆయన ఆ వయస్సు వారినే నిర్ణయించాడు. బహుశా ఈ నియమాన్ని బట్టే మన ప్రభువైన యేసుక్రీస్తు కూడా తన పరిచర్యను 30వ యేట ప్రారంభించాడు (లూకా 3:23). కాబట్టి సంఘంలో పరిచర్య చెయ్యాలనే ఆశగలవారు మానసికంగానూ శారీరకంగానూ బలపడి అప్పుడు మాత్రమే దానికి సిద్ధపడాలి.

అయితే ఈ వచనాలలో దేవుడు ప్రత్యక్షగుడారంలో సేవ చెయ్యడానికి 30 యేళ్ళ నుండి వయస్సు గలవారిని లెక్కించమని ఆజ్ఞాపిస్తే సంఖ్యాకాండము 8:24లో "ఇరువది యైదేండ్లు మొదలుకొని పైప్రాయముగల ప్రతివాడును ప్రత్యక్షపు గుడారముయొక్క సేవలో పని చేయుటకు రావలెను" అని ఆజ్ఞాపించడం మనం చూస్తాం. ఇక్కడేమో 30 నుండి పని చెయ్యాలని ఉంది అక్కడేమో 25 నుండే పనికి రావాలని ఉంది. కొందరు దీనిని వైరుధ్యంగా ప్రస్తావిస్తుంటారు కానీ అధికారికంగా పని చేసేది 30 యేళ్ళ నుండే. ముందటి 5 సంవత్సరాలు శిక్షణకు సంబంధించిన పని అనుకున్నప్పుడు ఇక్కడ ఎలాంటి వైరుధ్యం లేదు. శిక్షణ లేకుండా ఏ పనీ సాధ్యపడదుగా! సంఘంలో మనం కూడా కొంతకాలం పెద్దలవద్ద శిక్షణ పొందాకనే బహిరంగ పరిచర్యలో అడుగుపెట్టాలి.

అదేవిధంగా ప్రత్యక్షగుడారపు సేవ చెయ్యవలసినవారిలో కహాతీయులే మొదట లెక్కించబడుతున్నారు. కారణం; వీరికి ప్రత్యక్షగుడారంలో మందసం, దీపవృక్షం, సన్నిధిబల్ల, బలిపీఠం వంటి అతి ప్రాముఖ్యమైన వస్తువుల బాధ్యత అప్పగించబడింది (సంఖ్యాకాండము 4:4-15). నాయకుడైన మోషే ప్రధానయాజకుడైన అహరోనులు కూడా కహాతు వంశానికి చెందినవారే‌ (నిర్గమకాండము 6:16-20). ఆవిధంగా దేవుడు యాజకత్వానికి సమీపంగా ఉన్న కహాతు వంశాన్ని ప్రాముఖ్యమైనదిగా నియమించాడు.

సంఖ్యాకాండము 4:4-15 అతి పరిశుద్ధమైన దాని విషయములో ప్రత్య క్షపు గుడారమునందు కహాతీయులు చేయవలసిన సేవయేదనగా దండు ప్రయాణమైనప్పుడు అహరోనును అతని కుమారులును లోపలికి వచ్చి అడ్డతెరను దించి దానితో సాక్ష్యపు మందసమును కప్పి దానిమీద సముద్రవత్సల చర్మమయమైన కప్పునువేసి దానిమీద అంతయు నీలవర్ణముగల బట్టను పరచి దాని మోతకఱ్ఱలను దూర్చవలెను. సన్నిధిబల్లమీద నీలిబట్టను పరచి దాని మీద గిన్నెలను ధూపార్తులను పాత్రలను తర్పణ పాత్ర లను ఉంచవలెను. నిత్యముగా ఉంచవలసిన రొట్టెలును దానిమీద ఉండవలెను. అప్పుడు వారు వాటిమీద ఎఱ్ఱబట్ట పరచి దానిమీద సముద్రవత్సల చర్మపు కప్పువేసి దాని మోతకఱ్ఱలను దూర్చవలెను. మరియు వారు నీలి బట్టను తీసికొని దీపవృక్షమును దాని ప్రదీపములను దాని కత్తెరను దాని కత్తెర చిప్పలను దాని సేవలో వారు ఉప యోగపరచు సమస్త తైలపాత్రలను కప్పి దానిని దాని ఉపకరణములన్నిటిని సముద్రవత్సల చర్మమయమైన కప్పులో పెట్టి దండెమీద ఉంచవలెను. మరియు బంగారుమయమైన బలిపీఠముమీద నీలిబట్టనుపరచి సముద్రవత్సల చర్మముతో దానిని కప్పి దాని మోతకఱ్ఱలను దూర్చవలెను. మరియు తాము పరిశుద్ధస్థలములో సేవ చేయు ఆ ఉపకరణములన్నిటిని వారు తీసికొని నీలిబట్టలో ఉంచి సముద్రవత్సల చర్మముతో కప్పి వాటిని దండెమీద పెట్టవలెను. వారు బలిపీఠపు బూడిద యెత్తి దానిమీద ధూమ్రవర్ణముగల బట్టను పరచి దానిమీద తమ సేవోప కరణములన్నిటిని, అనగా ధూపార్తి ముండ్లు గరిటెలు గిన్నెలునైన బలిపీఠపు ఉపకరణములన్నిటిని దానిమీద పెట్టి, సముద్రవత్సల చర్మమయమైన కప్పును దానిమీద పరచి, దాని మోతకఱ్ఱలను తగిలింపవలెను. దండు ప్రయాణమైనప్పుడు అహరో నును అతని కుమారులును పరిశుద్ధస్థలమును పరిశుద్ధస్థలముయొక్క ఉపకరణములన్ని టిని కప్పుట ముగించిన తరువాత కహాతీయులు దాని మోయ రావలెను. అయితే వారు చావకయుండునట్లు పరిశుద్ధ మైనదానిని ముట్టకూడదు. ఇవి ప్రత్యక్షపు గుడా రములో కహాతీయుల భారము.

ఈ వచనాలలో ఇశ్రాయేలీయుల అరణ్య ప్రయాణంలో ప్రత్యక్షగుడారం ఒకచోట నుండి మరోచోటికి మార్చబడేటప్పుడు కహాతీయులు మొయ్యవలసిన పరిశుద్ధ వస్తువుల గురించి మనం చూస్తాం. మందసాన్నీ సన్నిధిబల్లనూ బలిపీఠాన్నీ దానికి సంబంధించిన గరిటెలనూ దీపవృక్షాన్నీ దానికి సంబంధించిన కత్తెర చిప్పలనూ వీటన్నిటినీ కహాతీయులే మొయ్యాలి. వాటిని మోతకర్రల సాయంతో భుజాలపైనే మొయ్యాలి, గెర్షోనీయులకూ మొరారీయులకు వలే వీరికి ఎద్దులబండ్లు ఇవ్వబడలేదు (సంఖ్యాకాండము 7:6-9). అయితే అహరోను కుమారులు అనగా యాజకులు ముందుగా వాటిని నీలిబట్టతోనూ సముద్రవత్సల చర్మంతోనూ కప్పిన తర్వాతనే కహాతీయులు వాటిని మొయ్యాలి. వాటిని నేరుగా తాకే అర్హత వారికి లేదు. ఉజ్జా ఈ నియమాన్ని మీరే నేరుగా మందసాన్ని తాకి చనిపోయాడు (2 సమూయేలు 6:6,7).

అరణ్యంలో ప్రత్యక్షగుడారం ఒకచోటినుండి మరోచోటికి మార్చబడేటప్పుడు పరిశుద్ధ వస్తువులను నీలిబట్టతో సముద్రవత్సల చర్మంతోనూ కప్పడం ఆయన పరిశుద్ధత యొక్క భయంకరత్వాన్ని సూచిస్తుంది. అంటే ఆయన అనుమతి పొందిన యాజకులకు తప్ప ఇతరులెవ్వరికీ ఆయన పరిశుద్ధవస్తువులను నేరుగా చూసే అర్హత కూడా లేదు.

అదేవిధంగా ఈ వచనాలలో "బంగారుమయమైన బలిపీఠము మీద నీలిబట్టనుపరచి సముద్రవత్సల చర్మముతో దానిని కప్పి దాని మోతకఱ్ఱలను దూర్చవలెను" అని చదువుతున్నాం. ఇది ప్రత్యక్షగుడారపు ఆవరణంలో బలులు అర్పించే బలిపీఠం కాదు. ప్రత్యక్షగుడారంలో ధూపం వేసే ధూపవేదికే ఇక్కడ "బంగారుమయమైన బలిపీఠము" గా ప్రస్తావించబడింది. ఎందుకంటే అది బంగారు రేకుతో పొదిగించబడిన ధూపవేదిక (నిర్గమకాండము 30:1-4). ఇదీ బలులు అర్పించే ఇత్తడి బలిపీఠం రెండూ వేరు కాబట్టే దాని గురించి మరలా "వారు బలిపీఠపు బూడిద యెత్తి దానిమీద ధూమ్రవర్ణముగల బట్టను పరచి దానిమీద తమ సేవోప కరణములన్నిటిని, అనగా ధూపార్తి ముండ్లు గరిటెలు గిన్నెలునైన బలిపీఠపు ఉపకరణములన్నిటిని దానిమీద పెట్టి, సముద్రవత్సల చర్మమయమైన కప్పును దానిమీద పరచి, దాని మోతకఱ్ఱలను తగిలింపవలెను" అని రాయబడింది.

సంఖ్యాకాండము 4:16 యాజకుడగు అహరోను కుమారుడైన ఎలియాజరు పైవిచారణలోనికి వచ్చునవి ఏవనగా దీపతైలము పరిమళ ధూపద్రవ్యములు నిత్య నైవేద్యము అభిషేకతైలము. మందిరమంతటి పైవిచారణ పరిశుద్ధస్థలములోనేమి, దాని ఉపకరణములలోనేమి, దానిలోనున్న అంతటి పై విచారణలోనికి అతని భారము.

ఈ వచనంలో అహరోను కుమారుడైన ఎలియాజరు విచారణలోకి వచ్చే పరిశుద్ధ వస్తువుల గురించి మనం చూస్తాం. ఇతను లేవీయుల ప్రధానులకు ముఖ్యుడు, పరిశుద్ధస్థలమును కాపాడు వారిమీద విచారణకర్త (సంఖ్యాకాండము 3:32). దీపతైలము పరిమళ ధూపద్రవ్యములు నిత్య నైవేద్యము అభిషేకతైలము చాలా ప్రాముఖ్యమైనవి కాబట్టి అవి అతని విచారణకు అప్పగించబడ్డాయి.

సంఖ్యాకాండము 4:17-20 మరియు యెహోవా మోషే అహరోనులకు ఈలాగు సెలవిచ్చెను. మీరు కహాతీయుల గోత్ర కుటుంబములను లేవీయులలోనుండి ప్రత్యేకింపకుడి. వారు అతి పరిశుద్ధమైనదానికి సమీపించినప్పుడు వారు చావక బ్రదికి యుండునట్లు మీరు వారినిగూర్చి చేయవలసినదేదనగా అహరోనును అతని కుమారులును లోపలికి వచ్చి ప్రతి వానికి వాని వాని పనియు వాని వాని బరువును నియమింపవలెను. వారు చావకయుండునట్లు పరిశుద్ధస్థలమును రెప్పపాటు సేపైనను చూచుటకు లోపలికి రాకూడదు.

ఈ వచనాలలో దేవుడు కహాతీయులు ప్రత్యక్షగుడారంలోని మందసం, దీపవృక్షం, బలిపీఠం, సన్నిధిబల్ల, ధూపవేదిక ఇతరమైన పరిశుద్ధవస్తువులను మొయ్యడానికి సిద్ధపడినప్పుడు వారు తీసుకోవలసిన జాగ్రత్తల గురించి హెచ్చరించడం మనం చూస్తాం. మొదటిది వారు నేరుగా వాటిని తాకకూడదు, యాజకులు నీలిబట్టతోనూ చర్మంతోనూ కప్పిన తర్వాతే వాటిని మొయ్యాలి, రెండు ప్రత్యక్షగుడారాన్ని రెప్పపాటు సేపైనా చూడడానికి లోపలికి వెళ్ళకూడదు. పరిశుద్ధవస్తువులను యాజకులు బయటపెట్టిన తర్వాతనే మొయ్యాలి. ఈ నియమం దేవుని మహిమ నివసించే ప్రత్యక్షగుడారాన్ని ఎంత పరిశుద్ధంగా గౌరవించాలో తెలియచేస్తుంది. దేవుడు నిర్ణయించుకున్న యాజకుడు మినహా పాపియైన మనిషి అందులోకి ప్రవేశించినా ఆయన పరిశుద్ధవస్తువులను తాకినా భయంకరమైన మరణం తప్పదు. దీనినిబట్టి పాపియైన మనిషి ఆయన సన్నిధిని సమీపించలేడని నేర్చుకుంటున్నాం. భవిష్యత్తులో మనం కూడా కేవలం క్రీస్తు రక్తాన్ని బట్టే ఆయన సన్నిధియైన పరలోకంలో ప్రవేశించబోతున్నాం.

సంఖ్యాకాండము 4:21-28 మరియు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను గెర్షోనీయులను వారివారి పితరుల కుటుంబముల చొప్పు నను వారివారి వంశముల చొప్పునను లెక్కించి సంఖ్యను వ్రాయించుము. ముప్పదియేండ్లు మొదలుకొని యేబది యేండ్లవరకు వయస్సు కలిగి ప్రత్యక్షపు గుడారములో సేవచేయుటకు సేనలో పని చేయ చేరువారందరిని లెక్కింపవలెను. పనిచేయుటయు మోతలు మోయుటయు గెర్షో నీయుల సేవ; వారు మందిరముయొక్క తెరలను ప్రత్యక్షపు గుడార మును దాని కప్పును దాని పైనున్న సముద్రవత్సల చర్మమయమైన పైకప్పును ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారపు తెరను ప్రాకార తెరలను మందిరము చుట్టును బలిపీఠము చుట్టును ఉండు ప్రాకారపు గవిని ద్వారపు తెరలను వాటి త్రాళ్లను వాటి సేవా సంబంధ మైన ఉపకరణములన్నిటిని వాటికొరకు చేయ బడినది యావత్తును మోయుచు పనిచేయుచు రావలెను. గెర్షోనీయుల పని అంతయు, అనగా తాము మోయు వాటినన్నిటిని చేయు పనియంతటిని అహరోనుయొక్కయు అతని కుమారులయొక్కయు నోటిమాట చొప్పున జరుగ వలెను. వారు జరుపువాటి నన్నిటిని జాగ్రత్తగా చూచు కొనవలెనని వారికి ఆజ్ఞాపింపవలెను. ప్రత్యక్షపు గుడా రములో గెర్షోనీయులయొక్క పని యిది; వారు పని చేయుచు యాజకుడగు అహరోను కుమారుడైన ఈతా మారు చేతిక్రింద నుండవలెను.

ఈ వచనాలలో దేవుడు ప్రత్యక్షగుడారం విషయంలో గెర్షోనీయులు చెయ్యవలసిన సేవను ఆజ్ఞాపించడం మనం చూస్తాం. వారిలో 30-50 వయస్సు ఉన్నవారు అరణ్యంలో ప్రత్యక్షగుడారం ఒకచోటినుండి మరోచోటికి మార్చబడేటప్పుడు అహరోను కుమారుడైన ఈతామారు పర్యవేక్షణలో మందిరపు తెరలు, ప్రత్యక్షపు గుడారం కప్పు, సముద్రవత్సల చర్మంతో చేసిన పైకప్పు, గుడారపు ద్వారం తెర, ప్రాకారపు తెరలు, ప్రాకార ద్వారపు తెర, త్రాళ్ళు వాటికి సంబంధించిన అన్ని ఉపకరణాలును మొయ్యాలి. వాటిని నాలుగు ఎద్దులు గల రెండు బండ్లపై మొయ్యాలి (సంఖ్యాకాండము 7:7).

సంఖ్యాకాండము 4:29-33 మెరారీయులను వారివారి వంశములచొప్పునను వారి వారి పితరుల కుటుంబముల చొప్పునను లెక్కింపవలెను. ముప్పదియేండ్లు మొదలుకొని యేబది యేండ్లవరకు వయస్సు కలిగి ప్రత్యక్షపు గుడారములో పనిచేయుటకు సేనగా చేరువారందరిని లెక్కింపవలెను. ప్రత్యక్షపు గుడార ములో వారు చేయు పని అంతటి విషయములో వారు, మందిరపు పలకలను దాని అడ్డ కఱ్ఱలను దాని స్తంభములను దాని దిమ్మలను దాని చుట్టునున్న ప్రాకార స్తంభము లను వాటి దిమ్మలను వాటి మేకులను వాటి త్రాళ్లను వాటి ఉపకరణములన్నిటిని వాటి సంబంధమైన పనియంతటికి కావ లసినవన్నిటిని వారు మోసి కాపాడవలసిన బరువు లను పేర్ల వరుసను లెక్కింపవలెను. మెరారీయుల వంశములు ప్రత్యక్షపు గుడారములో యాజకుడగు అహ రోను కుమారుడైన ఈతామారు చేతిక్రింద చేయవలసిన సేవ యిది; అంతే వారు చేయవలసిన సేవ అని చెప్పెను.

ఈ వచనాలలో దేవుడు ప్రత్యక్షగుడారం విషయంలో మొరారీయులు చెయ్యవలసిన సేవ గురించి ఆజ్ఞాపించడం మనం చూస్తాం. వారిలో 30-50 వయస్సు ఉన్నవారు అరణ్యంలో ప్రత్యక్షగుడారం ఒకచోటి నుండి మరోచోటికి మార్చబడేటప్పుడు మందిరపు పలకలు, అడ్డ కఱ్ఱలు, స్తంభాలు, దిమ్మలు, ప్రాకారపు భాగాలు, ప్రాకారపు స్తంభాలు, వాటి దిమ్మలు, మేకులు, త్రాళ్ళను మొయ్యాలి. ఎనిమిది ఎద్దులు గల నాలుగు బండ్లపై వాటిని మొయ్యాలి (సంఖ్యాకాండము 7:8). నిజానికి వీరికి చాలా భారమైన పని అప్పగించబడింది, వీరు మొయ్యవలసినవన్నీ బరువైనవే. అయితేనేం అవి మందిరానికి చాలా ప్రాముఖ్యమైనవి అవి లేకపోతే మందిరమే‌ నిలబెట్టబడదు. అందుకే వీరికి గెర్షోనీయుల కంటే రెట్టింపు ఎద్దులబండ్లు‌ ఇవ్వబడ్డాయి.

ఈవిధంగా దేవుడు లేవీ కుమారులైన కహాతు వంశానికీ గెర్షోను వంశానికీ మొరారీ వంశానికీ ప్రత్యక్షగుడారం విషయంలో వేరు వేరు బాధ్యతలు అప్పగించాడు. కహతీయులకు పరిశుద్ధ వస్తువులు, గెర్షోనీయులకు తెరలు త్రాళ్ళు, మొరారీయులకు స్థంబాలూ పలకలు. అన్నీ ప్రత్యక్షగుడారానికి అవసరమైనవే. ఈ నియమాన్ని బట్టి మనం కూడా సంఘంలో మనకు అప్పగించబడిన ఆయా బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తూ సంఘ క్షేమాభివృద్ధికి పాటుపడాలి, అరణ్యం‌ వంటి ఈ లోకంలో ఎన్నో సంఘాలు నిర్మించాలి.‌

సంఖ్యాకాండము 4:34-49 అప్పుడు మోషే అహరోనులు సమాజప్రధానులను కహాతీయులను, అనగా వారివారి వంశముల చొప్పునను వారివారి పితరుల కుటుంబముల చొప్పునను ముప్పది యేండ్లు మొదలుకొని యేబది యేండ్లవరకు ప్రాయము కలిగి ప్రత్యక్షపు గుడారములో సేవ చేయుటకు సేనగా చేరువారందరిని లెక్కించిరి. వారివారి వంశములచొప్పున వారిలో లెక్కింపబడిన వారు రెండువేల ఏడువందల ఏబదిమంది. ప్రత్యక్షపు గుడారములో సేవచేయ తగిన వారని కహాతీయుల వంశములలో లెక్కింపబడినవారు వీరే; యెహోవా మోషేచేత పలికించిన మాటచొప్పున మోషే అహరోనులు వారిని లెక్కించిరి. గెర్షోనీయులలో వారివారి వంశములచొప్పునను వారి వారి పితరుల కుటుంబముల చొప్పునను లెక్కింప బడిన వారు, అనగా ముప్పది యేండ్లు మొదలుకొని యేబది యేండ్లవరకు ప్రాయము కలిగి ప్రత్యక్షపు గుడారములో సేవచేయుటకై సేనగా చేరువారందరు తమ తమ వంశముల చొప్పునను తమ తమ పితరుల కుటుంబముల చొప్పునను వారిలో లెక్కింపబడిన వారు రెండువేల ఆరు వందల ముప్పదిమంది. ప్రత్యక్షపు గుడారములో సేవ చేయతగినవారని గెర్షోనీయులలో లెక్కింపబడినవారు వీరే; యెహోవా నోటిమాటను బట్టి మోషే అహరోనులు వారిని లెక్కించిరి. మెరారీయుల వంశములలో తమ తమ వంశముల చొప్పునను తమ తమ పితరుల కుటుంబముల చొప్పునను లెక్కింపబడినవారు అనగా ముప్పదియేండ్లు మొదలుకొని యేబది యేండ్లవరకు ప్రాయము కలిగి ప్రత్య క్షపు గుడారములో సేవ చేయుటకు సేనగా చేరువారు అనగా తమ తమ వంశములచొప్పున వారిలో లెక్కింప బడినవారు మూడువేల రెండువందలమంది. మెరారీ యుల వంశములలో లెక్కింపడినవారు వీరే; యెహోవా మోషే చేత పలికించిన మాటనుబట్టి మోషే అహరోనులు వారిని లెక్కించిరి. మోషే అహరోనులు ఇశ్రాయేలీ యుల ప్రధానులును లెక్కించిన లేవీయులలో ముప్పది యేండ్లు మొదలుకొని యేబది యేండ్లవరకు ప్రాయము కలిగి తమ తమ వంశములచొప్పునను తమ తమ పితరుల కుటుంబముల చొప్పునను లెక్కింపబడినవారు అనగా ప్రత్యక్షపు గుడారములో సేవయు మోతయు జరిగించు నిమిత్తమై చేరువారందరు, అనగా వారిలో లెక్కింపబడిన వారు ఎని మిదివేల ఐదువందల ఎనుబదిమంది. యెహోవా నోటి మాట చొప్పున మోషేచేత వారు లెక్కింపబడిరి; ప్రతి వాడును తన తన సేవనుబట్టియు తన తన మోతను బట్టియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు వారు అతనివలన లెక్కింపబడిరి.

ఈ వచనాలలో మోషే అహరోనులు దేవుడు ఆజ్ఞాపించినట్టే లేవీగోత్రంలోని కహతీయులనూ గెర్షోనీయులనూ మొరారీయులనూ 30-50 వయస్సు ఉన్నవారిని లెక్కించడం మనం చూస్తాం. ఆ లెక్కను బట్టి కహాతీయులు 2750 మంది, గెర్షోనీయులు 2630‌ మంది, మెరారీయులు 3200 మంది‌ మొత్తం‌ 8580 మంది. వీరందరూ ప్రత్యక్షగుడారం‌ విషయంలో వారి వారి బరువులను మోస్తూ వారికి అప్పగించబడిన వస్తువులను కాపాడాలి. ఈ సంఖ్యలో మొరారీయులు ఎక్కువమందిగా ఉన్నారు. వారికి అప్పగించబడిన వస్తువులు భారమైనవి కాబట్టి దేవుడు వారిని మిగిలిన రెండు వంశాలకంటే ఎక్కువగా అభివృద్ధి చేసాడు.