Hits: 192
Print
రచయిత: కె విద్యా సాగర్

                                                            గ్ర‌ంథపరిచయం

లేవీయకాండానికి కొనసాగింపుగానే ఈ సంఖ్యాకాండము రాయబడింది. హీబ్రూ లో ఈ పుస్తకం పేరు "בְּמִדְבַּר" (Bemidbar) దీనికి అరణ్యంలో అని అర్థం. ఎందుకంటే ఇందులో మరికొన్ని దేవుని ఆజ్ఞలతో పాటు ఇశ్రాయేలీయులు తమ అవిధేయత వల్ల అరణ్యంలో 40 సంవత్సరాలు తిరుగులాడిన చరిత్ర రాయబడింది. అయితే ఈ పుస్తకం మొదటి అధ్యాయంలోనూ మరలా 26వ అధ్యాయంలోనూ జనసంఖ్య రాయబడడాన్ని బట్టి Septuagint (LXX) లో దీని పేరు "సంఖ్యలు" (Numbers) అనే అర్థం వచ్చేలా "Ἀριθμοί" (arithmoi) గా మార్పు చేసారు. అందుకే తెలుగులో దీనిని సంఖ్యాకాండము అంటున్నాం.

ప్రాచీన యూదుల మరియు యేసుక్రీస్తు, అపోస్తలుల అంగీకారం ప్రకారం ఆదికాండము, నిర్గమకాండము, లేవీకాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశ కాండాలను మోషే పరిశుద్ధాత్మ ప్రేరణతో రచించాడు (మార్కు 12:26, యోహాను 1:17, 5:46, 7:19, 7:23, ఆపో.కార్యములు 7:37,38, 13:39, 15:1, 28:23). వీటిని యూదులు తోరా అని పిలుస్తారు. ఈ పుస్తకాలను గురించి కొన్ని సందర్భాలలో, ధర్మశాస్త్రం, మోషే ధర్మశాస్త్రం, మోషే అని కూడా రాయబడింది (2 కొరింథీ 3:16 English version, అపో.కార్యములు 21:21, 24:14, లూకా 24:44).

సంఖ్యాకాండము 1:1-3 వారు ఐగుప్తు దేశమునుండి బయలువెళ్లిన రెండవ సంవత్సరము రెండవ నెల మొదటి తేదిని, సీనాయి అరణ్య మందలి ప్రత్యక్షపు గుడారములో యెహోవా మోషేతో ఇట్లనెను. ఇశ్రాయేలీయుల వంశముల చొప్పున వారి వారి పితరుల కుటుంబములనుబట్టి వారి వారి పెద్దలచొప్పున మగవారినందరిని లెక్కించి సర్వసమాజసంఖ్యను వ్రాయించుము. ఇశ్రాయేలీయులలో సైన్యముగా వెళ్లువారిని, అనగా ఇరువది యేండ్లు మొదలుకొని పైప్రాయముగల వారిని, తమ తమ సేనలనుబట్టి నీవును అహరోనును లెక్కింపవలెను.

ఈ వచనాలలో దేవుడు ఇశ్రాయేలీయుల్లో 20 యేళ్ళ నుంచి పై వయస్సు ఉన్న మగవారిని లెక్కించమని ఆజ్ఞాపించడం మనం చూస్తాం. ఇది పౌరసంఖ్య కాదు సైన్యానికి సంబంధించిన సంఖ్య. ఆ విషయం 3వ వచనంలో "ఇశ్రాయేలీయులలో సైన్యముగా వెళ్లువారిని" అంటూ స్పష్టంగా రాయబడింది. 2వ అధ్యాయంలో మరింత స్పష్టంగా ఉంటుంది. అందుకే ఈ సంఖ్యలో స్త్రీలూ పిల్లలూ చేర్చబడలేదు.

గమనించండి; ఇంతవరకూ ఆయన తన ఆజ్ఞలనూ ప్రత్యక్షగుడారానికి సంబంధించిన విధులనూ వారికి‌ బోధించాడు. ఇప్పుడు మిగిలిందల్లా వారు సైన్యంగా బయలుదేరి కనానును స్వాధీనం చేసుకోవడమే. అందుకే ఇప్పుడు ఆయన సైన్యానికి సంబంధించిన సంఖ్యను నమోదు చెయ్యమంటున్నాడు. ఈ సంఘటనను బట్టి మనం ప్రాముఖ్యమైన విషయం నేర్చుకోవాలి. విశ్వాసులు మొదట దేవుని ఆజ్ఞలనూ ఆయన విధులనూ శ్రద్ధగా నేర్చుకోవాలి. ఆ తర్వాత లోకంతోనూ అపవాదితోనూ యుద్ధానికి సిద్ధమవ్వాలి. దేవుని ఆజ్ఞలేంటో ఆయన విధులేంటో తెలియకుండా లోకంతోనూ అపవాదితోనూ యుద్ధానికి సిద్ధమైనప్పటికీ ఓటమి పాలవ్వడం తప్ప ఒరిగే విజయమంటూ ఏం ఉండదు.

అదేవిధంగా కనానును ఇశ్రాయేలీయులకు స్వాస్థ్యంగా ఇస్తానన్నది దేవుని వాగ్దానం. అయినప్పటికీ యుద్ధం చెయ్యాల్సింది మాత్రం వారే. వారు యుద్ధం చేసే ఆ వాగ్దాన దేశాన్ని స్వతంత్రించుకోవాలి. ఇది విశ్వాసులమైన మనం అన్వయించుకుంటే నిత్యరాజ్యమైన పరలోకం ఆయన వాగ్దానమే. అయినప్పటికీ అది పొందుకోవడానికి మనం ఎంతో ప్రయాసపడాలి. అందుకే పౌలు "మంచి పోరాటము పోరాడితిని, నా పరుగు కడ ముట్టించితిని, విశ్వాసము కాపాడుకొంటిని. ఇకమీదట నా కొరకు నీతికిరీట ముంచబడియున్నది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతియైన ప్రభువు అది నాకును, నాకు మాత్రమే కాకుండ తన ప్రత్యక్షతను అపేక్షించు వారికందరికిని అనుగ్రహించును" (2తిమోతికి 4:7,8) అంటున్నాడు.

చివరిగా "ఇశ్రాయేలీయులలో సైన్యముగా వెళ్లువారిని, అనగా ఇరువది యేండ్లు మొదలుకొని పైప్రాయముగల వారిని" ప్రధానయాజకుడైన అహరోనునే లెక్కించాలి. అంటే ఆ ప్రజల్లో యుద్ధం చేసే సామర్ధ్యం ఎంతమందికి ఉందో గుర్తించి వారిని లెక్కించే బాధ్యత అతనిదే. సంఘంలో కూడా ప్రభువు పక్షంగా పోరాడే సామర్ధ్యం గలవారెవరో సంఘ పెద్దలే నిర్ణయించాలి.

సంఖ్యాకాండము 1:4 మరియు ప్రతి గోత్రములో ఒకడు, అనగా తన పితరుల కుటుంబములో ముఖ్యుడు, మీతో కూడ ఉండవలెను.

ఈ వచనంలో దేవుడు ఇశ్రాయేలీయుల్లో 20 యేళ్ళ వయస్సు నుండి ఉన్నవారి సంఖ్యను లెక్కించేటప్పుడు వారి గోత్రాలలో ముఖ్యుడు మోషే అహరోనులతో ఉండాలని ఆజ్ఞాపించడం మనం చూస్తాం. అంటే లేవీయులు మినహా 11 గోత్రాలకూ 11 మంది ముఖ్యులు మోషే అహరోనులతో ఉండాలి. జరిగే ఆ లెక్కింపు కచ్చితంగా మరియు ప్రజలకు నమ్మకంగా ఉండాలి కాబట్టి దేవుడు ఈవిధంగా ఆజ్ఞాపించాడు.

ఈ నియమాన్ని బట్టి మనం ఇతర సంఘస్థులతో ఏదైనా ప్రాముఖ్యమైన కార్యక్రమం తలపెట్టేటప్పుడు లేక వివాహం వంటి బంధాన్ని ఏర్పరచుకునేటప్పుడు వారు హాజరయ్యే సంఘంలోని ప్రముఖుడి సమక్షంలో అది జరిగేలా చూసుకోవాలని నేర్చుకుంటున్నాం.

సంఖ్యాకాండము 1:5-16 మీతో కూడ ఉండవలసినవారి పేళ్లు ఏవేవనగా రూబేను గోత్రములో షెదేయూరు కుమారుడైన ఏలీసూరు. షిమ్యోను గోత్రములో సూరీషద్దాయి కుమారుడైన షెలుమీయేలు‌. యూదా గోత్రములో అమ్మీమనాదాబు కుమారుడైన నయస్సోను‌. ఇశ్శాఖారు గోత్రములో సూయారు కుమారుడైన నెతనేలు. జెబూలూను గోత్రములో హేలోను కుమారుడైన ఏలీయాబు. యోసేపు సంతానమందు, అనగా ఎఫ్రాయిము గోత్రములో అమీహూదు కుమారుడైన ఎలీషామాయు; మనష్షే గోత్రములో పెదాసూరు కుమారుడైన గమలీయేలు. బెన్యామీను గోత్రములో గిద్యోనీ కుమారుడైన అబీదాను. దాను గోత్రములో ఆమీషద్దాయి కుమారుడైన అహీయెజెరు. ఆషేరు గోత్రములో ఒక్రాను కుమారు డైన పగీయేలు గాదు గోత్రములో దెయూవేలు కుమారుడైన ఎలాసాపు. నఫ్తాలి గోత్రములో ఏనాను కుమారుడైన అహీర అనునవి. వీరు సమాజములో పేరు పొందినవారు. వీరు తమ తమ పితరుల గోత్రములలో ప్రధానులు ఇశ్రాయేలీయుల కుటుంబములకు పెద్దలును.

ఈ వచనాలలో దేవుడు మోషే అహరోనులతో పాటు గోత్రాల లెక్కింపులో పాల్గొనవలసిన ఆ గోత్రాల ప్రముఖుల పేర్లు తెలియచెయ్యడం మనం చూస్తాం. వారి పేర్లు కూడా ఆయనే ప్రస్తావించడం ద్వారా ఆ లెక్కింపు విషయంలో ఆయన ఎంత కచ్చితత్వాన్ని కోరుకుంటున్నాడో గమనిస్తున్నాం. అయితే ఈ సంఖ్యలో మనకు లేవీగోత్రం కనిపించదు, ఎందుకంటే వారు దేవునికి ప్రతిష్టులై ఆయన ప్రత్యక్షగుడారపు సేవకు చెందినవారు కాబట్టి ఇశ్రాయేలీయుల యుద్ధసైన్యంలో వారిని లెక్కించకూడదు (సంఖ్యాకాండము 1:47-50, 3:11-13).

సంఖ్యాకాండము 1:17-19 పేళ్ల చేత వివరింపబడిన ఆ మనుష్యులను మోషే అహ రోనులు పిలుచుకొని రెండవ నెల మొదటి తేదిని సర్వ సమాజమును కూర్చెను. ​ఇరువది ఏండ్లు మొదలుకొని పై ప్రాయముగలవారు తమ తమ వంశావళులను బట్టి తమ తమ వంశములను తమ తమ పితరుల కుటుంబములను తమ తమ పెద్దల సంఖ్యను తెలియచెప్పగా ​యెహోవా అతనికి ఆజ్ఞాపించినట్లు సీనాయి అరణ్యములో మోషే వారిని లెక్కించెను.

ఈ వచనాలలో మోషే అహరోనులు దేవుడు ఆజ్ఞాపించినట్టుగానే ఆయా గోత్రాల ప్రముఖులతో కలసి ఇశ్రాయేలీయుల్లో 20యేళ్ళ వయస్సు నుండి గలవారి సంఖ్యను లెక్కించడం మనం చూస్తాం. ఇక్కడ మోషే "రెండవ నెల మొదటి తేదిని సర్వ సమాజమును కూర్చెను" "సీనాయి అరణ్యములో మోషే వారిని లెక్కించెను" అని ఆ సంఖ్య జరిగిన కాలాన్నీ ప్రదేశాన్నీ ప్రస్తావించడాన్ని బట్టి ఆ సంఖ్య చారిత్రక ఘటన అని తెలియచేస్తున్నాడు.

అయితే ఒకేరోజు అంతమందిని ఎలా లెక్కించారు అని సందేహం ఇక్కడ కలగొచ్చు. కానీ "రెండవ నెల మొదటి తేదిని సర్వ సమాజమును కూర్చెను" అని రాయబడడాన్ని బట్టి ఆరోజు నుండి ఆ లెక్కింపు ప్రారంభమైందని మాత్రమే అర్థం చేసుకోవాలి. అది ఎన్నిరోజులు కొనసాగిందో రాయబడలేదు.

సంఖ్యాకాండము 1:20-44 ఇశ్రాయేలు ప్రథమ కుమారుడైన రూబేను పుత్రుల వంశావళి. తమ తమ వంశములలో తమ తమ పితరుల కుటుంబములలో ఇరువది యేండ్లు మొదలుకొని పై ప్రాయము కలిగి సేనగా వెళ్లువారందరి సంఖ్యను తెలియ చెప్పగా రూబేను గోత్రములో లెక్కింపబడిన వారు నలుబది యారువేల ఐదువందలమంది యైరి. షిమ్యోను పుత్రుల వంశావళి. తమ తమ వంశము లలో తమ తమ పితరుల కుటుంబములలో ఇరువదియేండ్లు మొదలుకొని పై ప్రాయము కలిగి సేనగా వెళ్లువారందరి పెద్దల సంఖ్యను తెలియచెప్పగా షిమ్యోను గోత్ర ములో లెక్కింపబడినవారు ఏబది తొమ్మిదివేల మూడు వందలమంది యైరి. గాదు పుత్రుల వంశావళి. తమ తమ వంశములలో తమ తమ పితరుల కుటుంబములలో ఇరువది యేండ్లు మొదలుకొని పైప్రాయము కలిగి సేనగా వెళ్లువారందరి సంఖ్యను తెలియచెప్పగా గాదు గోత్రములో లెక్కింప బడినవారు నలుబది యయిదువేల ఆరువందల ఏబదిమంది యైరి. యూదా పుత్రుల వంశావళి. తమ తమ వంశములలో తమ తమ పితరుల కుటుంబములలో ఇరువది యేండ్లు మొదలు కొని పైప్రాయము కలిగి సేనగా వెళ్లువారందరి సంఖ్యను తెలియచెప్పగా యూదా గోత్రములో లెక్కింపబడిన వారు డెబ్బది నాలుగువేల ఆరువందలమందియైరి. ఇశ్శాఖారు పుత్రుల వంశావళి. తమ తమ వంశ ము లలో తమ తమ పితరుల కుటుంబములలో ఇరువది యేండ్లు మొదలుకొని పై ప్రాయము కలిగి సేనగా వెళ్లువారందరి సంఖ్యను తెలియచెప్పగా ఇశ్శాఖారు గోత్రములో లెక్కింపబడిన వారు ఏబది నాలుగువేల నాలుగువందల మంది యైరి. జెబూలూను పుత్రుల వంశావళి. తమ తమ వంశము లలో తమ తమ పితరుల కుటుంబములలో ఇరువదియేండ్లు మొదలుకొని పైప్రాయము కలిగి సేనగా వెళ్లువారందరి సంఖ్యను తెలియచెప్పగా జెబూలూను గోత్రములో లెక్కింపబడిన వారు ఏబది యేడువేల నాలుగువందల మంది యైరి. యోసేపు పుత్రుల వంశావళి, అనగా ఎఫ్రాయిము పుత్రుల వంశావళి. తమ తమ వంశములలో తమ తమ పితరుల కుటుంబములలో ఇరువది యేండ్లు మొదలుకొని పై ప్రాయము కలిగి సేనగా వెళ్లు వారందరి సంఖ్యను తెలియచెప్పగా యోసేపు గోత్ర ములో లెక్కింపబడిన వారు నలుబదివేల ఐదువందల మంది యైరి. మనష్షే పుత్రుల వంశావళి. తమ తమ వంశములలో తమ తమ పితరుల కుటుంబములలో ఇరువది యేండ్లు మొదలుకొని పై ప్రాయము కలిగి సేనగా వెళ్లువారందరి సంఖ్యను తెలియచెప్పగా మనష్షే గోత్రములో లెక్కింప బడినవారు ముప్పది రెండువేల రెండువందలమంది యైరి. బెన్యామీను పుత్రుల వంశావళి. తమ తమ వంశము లలో తమ తమ పితరుల కుటుంబములలో ఇరువదియేండ్లు మొదలుకొని పై ప్రాయము కలిగి సేనగా వెళ్లువారందరి సంఖ్యను తెలియచెప్పగా బెన్యామీను గోత్రములో లెక్కింపబడిన వారు ముప్పది యైదువేల నాలుగువందల మంది యైరి. దాను పుత్రుల వంశావళి. తమ తమ వంశములలో తమ తమ పితరుల కుటుంబములలో ఇరువది యేండ్లు మొదలుకొని పై ప్రాయము కలిగి సేనగా వెళ్లు వారందరి సంఖ్యను తెలియచెప్పగా దానుగోత్రములో లెక్కింప బడినవారు అరువది రెండువేల ఏడువందల మంది యైరి. ఆషేరు పుత్రుల వంశావళి. తమ తమ వంశములలో తమ తమ పితరుల కుటుంబములలో ఇరువదియేండ్లు మొదలుకొని పై ప్రాయము కలిగి సేనగా వెళ్లువారందరి సంఖ్యను తెలియచెప్పగా ఆషేరు గోత్రములో లెక్కింప బడినవారు నలువది యొకవేయి ఐదువందలమంది యైరి. నఫ్తాలి పుత్రుల వంశావళి. తమ తమ వంశములలో తమ తమ పితరుల కుటుంబములలో ఇరువది యేండ్లు మొదలుకొని పై ప్రాయము కలిగి సేనగా వెళ్లువారందరి సంఖ్యను తెలియచెప్పగా నఫ్తాలి గోత్రములో లెక్కింప బడినవారు ఏబది మూడువేల నాలుగువందలమంది యైరి. వీరు లెక్కింపబడినవారు, అనగా మోషేయు అహ రోనును తమ తమ పితరుల కుటుంబములనుబట్టి ఒక్కొక్క డుగా ఏర్పడిన ప్రధానులును లెక్కించిన వారు.

ఈ వచనాలలో ఇశ్రాయేలీయుల 11 గోత్రాలలో సైన్యంగా బయలువెళ్ళేవారి సంఖ్యను మనం చూస్తాం. ఈ సంఖ్యలో లేవీగోత్రం ఎందుకు లెక్కించబడలేదో 5-16 వచనాల వ్యాఖ్యానంలో వివరించాను. ఆ గోత్రం మినహా మిగిలిన 11 గోత్రాలలో సైన్యంగా బయలువెళ్ళేవారు "ఆరులక్షల మూడువేల ఐదువందల ఏబదిమందియైరి" (సంఖ్యాకాండము 1:46). వీరే దేవుని సేనలుగా ప్రస్తావించబడ్డారు (నిర్గమకాండము 12:41). ఈ గోత్రాల సంఖ్యలో మనం గమనించవలసిన కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు:

1. ఈ గోత్రాలందరిలోనూ ఎక్కువ సైన్యం గల గోత్రం యూదా గోత్రం. అందులో 74600 మంది సైన్యంగా ఉన్నారు (27వ). కారణం: ఆ గోత్రంలోనే మెస్సీయ జన్మించబోతున్నాడు కాబట్టి ఆ గోత్రం ముందునుండీ మిగిలిన గోత్రాలకంటే బలంగా ఉంది. అందుకే "యూదా తన సహోదరులకంటె హెచ్చినవాడాయెను, అతనినుండి ప్రముఖుడు బయలువెడలెను" (1 దినవృత్తాంతములు 5:2) అని రాయబడింది.

2. యాకోబు తన మరణసమయంలో యోసేపు కుమారులను ఆశీర్వదిస్తూ యోసేపు పెద్దకుమారుడైన మనష్షే కంటే చిన్న కుమారుడైన ఎఫ్రాయీము గొప్ప జనం ఔతాడని ప్రవచించాడు (ఆదికాండము 48:13-19). ఆ నెరవేర్పును ఇక్కడ చూస్తున్నాం. పెద్దవాడైన మనష్షే గోత్రంలోని సైన్యం 32200 మంది ఐతే (35వ) చిన్నవాడైన ఎఫ్రాయీము గోత్రంలోని సైన్యం 40500 మంది. సంఖ్యాపరంగా ఆ నెరవేర్పు ఇంతటితో జరిగిపోయింది. తర్వాత సంఖ్యలో ఎఫ్రాయీము కంటే మనష్షే గోత్రం వారే ఎక్కువమందిగా ఉన్నారు (సంఖ్యాకాండము 26:34-37). కాబట్టి ఆ ప్రవచనాన్ని కేవలం సంఖ్యాపరమైన కోణం నుండే చూడకూడదు. ఎందుకంటే ఎఫ్రాయీము బలం శాశ్వతంగా ఉంది, యెహోషువ వంటి నాయకుడు ఆ గోత్రానికి చెందినవాడే. ధ్వజాల చొప్పున దిగే వరుసలో కూడా మనష్షే కంటే ఎఫ్రాయీమే ముందు ఉన్నాడు. ఇశ్రాయేలీయుల పది గోత్రాలనూ ప్రవక్తలు ఎఫ్రాయిము పేరుతోనే ప్రస్తావించారు‌ (హోషెయ 4:17, 5:3, 6:4, యెషయా 7:2,9, 11:13, యిర్మియా 31:9). ఆవిధంగా కూడా యాకోబు ప్రవచనం నెరవేరింది.

3. లెక్కించబడిన ఈ గోత్రాల సైన్యం ఆరులక్షల మూడువేల ఐదువందల ఏబదిమందిలో కాలేబు, యెహోషువాలు తప్ప మరెవ్వరూ కనానులో ప్రవేశించలేదు. తిరుగుబాటును బట్టి వీరంతా అరణ్యంలోనే నశించిపోయారు (సంఖ్యాకాండము 14:29, ద్వితీయోపదేశకాండము 2:14,15). అది క్రమక్రమంగా జరుగుతూ వచ్చింది. ఉదాహరణకు; షిమ్యోను గోత్రం. ప్రస్తుతం వారు 59300 మందిగా ఉంటే తర్వాత సంఖ్యలో 22200 మందిగా తగ్గిపోయారు (సంఖ్యాకాండము 26:14). దేవుని సైన్యపు లెక్కలో ఉంటే సరిపోదు ఆయనకు విధేయత చూపించడం ప్రాముఖ్యం అని ఇక్కడ నేర్చుకుంటున్నాం. ఆయన సైన్యపు లెక్కలో ఉన్నప్పటికీ ఆయన సంఘ సభ్యుల జాబీతాలో ఉన్నప్పటికీ అవిధేయులకు నాశనం తప్పదు.

సంఖ్యాకాండము 1:46 లెక్కింపబడి ఆరులక్షల మూడువేల ఐదువందల ఏబదిమందియైరి.

ఈ వచనంలో లేవీగోత్రం మినహా ఇశ్రాయేలీయుల 11 గోత్రాలలో యుద్ధం చెయ్యగలిగే 20 యేళ్ళ నుండి వయస్సు ఉన్నవారి సంఖ్యను మనం చూస్తాం. అక్షరాలా వారు ఆరులక్షల మూడువేల ఐదువందల ఏబదిమంది. ఆ లెక్కన స్త్రీలూ పిల్లలూ కలపి ఆ సంఖ్యకు రెట్టింపు ఉండవచ్చు. 70 మందిగా ఐగుప్తుకు వెళ్ళిన యాకోబు కుటుంబం కేవలం 215 సంవత్సరాలలో ఇంతలా విస్తరించడం దేవుని అద్భుతం, ఆయన వాగ్దానం, ఆశీర్వాదం (ఆదికాండము 15:5, 22:17, 26:4, 46:3, నిర్గమకాండము 1:7).

అరణ్యంలో ఇంతమందికి ఆహారం, నీళ్ళు ఎలా లభించాయంటే వారికి‌ బండనుండి నీరు, ఆకాశం నుండి మన్నా ఆయన పుష్కలంగా అనుగ్రహిస్తూ వచ్చాడు.

సంఖ్యాకాండము 1:47-49 అయితే లేవీయులు తమ పితరుల గోత్రము చొప్పున వారితో పాటు లెక్కింపబడలేదు. ఏలయనగా యెహోవా మోషేతో ఈలాగు సెలవిచ్చియుండెనునీవు లేవీగోత్రమును లెక్కింపకూడదు. ఇశ్రాయేలీ యుల మొత్తమునకు వారి మొత్తమును చేర్చకూడదు.

ఈ వచనాలలో దేవుడు లేవీయులను ఇశ్రాయేలీయులతో పాటుగా లెక్కించకూడదని ఆజ్ఞాపించడం మనం చూస్తాం. వారు దేవుని మందిర సేవకోసం ప్రత్యేకించబడినవారు కాబట్టి (సంఖ్యాకాండము 3:11-13) వారిని యుద్ధసైన్యంతో కలపి లెక్కించకూడదు, ఆ విషయం క్రింది వచనాలలోనూ స్పష్టంగా ఉంది. అయితే వారి ప్రత్యేక లెక్కింపు 3వ అధ్యాయంలో రాయబడింది.

సంఖ్యాకాండము 1:50,51 నీవు సాక్ష్యపు గుడారము మీదను దాని ఉపకరణము లన్నిటిమీదను దానిలో చేరిన వాటన్నిటి మీదను లేవీయులను నియమింపుము. వారే మందిర మును దాని ఉపకర ణములన్నిటిని మోయవలెను. వారు మందిరపు సేవ చేయుచు దానిచుట్టు దిగవలసిన వారై యుందురు. మందిరము సాగబోవునప్పుడు లేవీయులే దాని విప్పవలెను, మందిరము దిగునప్పుడు లేవీయులే దాని వేయవలెను. అన్యుడు సమీపించిన యెడల వాడు మరణశిక్ష నొందును.

ఈ వచనాలలో లేవీయులకు దేవుడు అప్పగించిన బాధ్యతను మనం చూస్తాం. వీరిలో ఏయే వంశము ఏయే బాధ్యతలను నిర్వర్తించాలో అనగా అరణ్యంలో మందిరం యొక్క ఆయా భాగాలను ఎవరు కాపాడాలో మోయాలో అమర్చాలో 3,4 అధ్యాయాల్లో రాయబడింది.

"అన్యుడు సమీపించిన యెడల వాడు మరణశిక్ష నొందును"

అన్యుడు అంటే లేవీయుడు కానివాడు అని అర్థం. ఆయన తన మందిరం యొక్క సేవ లేవీయులకే అప్పగించాడు కాబట్టి దానిని మీరినవాడు ఆయన నియామకాన్ని మీరినవాడూ ఆయన పరిశుద్ధ వస్తువులను అపవిత్రపరిచినవాడూ ఔతాడు. అందుకే అలాంటివాడికి ఆయన మరణశిక్ష విధించాడు. దావీదు కాలంలో ఉజ్జా అనేవాడు ఈ ఆజ్ఞను మీరే మందసాన్ని ముట్టుకుని మరణించాడు (2 సమూయేలు 6:6,7). ఈ నియమాన్ని బట్టి సంఘంలో మనం కూడా మనకు అప్పగించబడిన బాధ్యతల్లో క్రమంగా కొనసాగాలి. వేరేవారికి అనుగ్రహించబడిన తలాంతుపై అసూయ పడకుండా మన తలాంతును శక్తివంచన లేకుండా వినియోగించాలి. అందుకే పౌలు "మన కనుగ్రహింపబడిన కృప చొప్పున వెవ్వేరు కృపావరములు కలిగినవారమైయున్నాము గనుక, పరిచర్యయైతే పరిచర్యలోను, బోధించువాడైతే బోధించుటలోను, హెచ్చరించువాడైతే హెచ్చరించుటలోను పనికలిగియుందము. పంచిపెట్టువాడు శుద్ధమనస్సుతోను, పైవిచారణ చేయువాడు జాగ్రత్తతోను, కరుణించువాడు సంతోషముతోను పని జరిగింపవలెను" (రోమా 12:6-8). అని హెచ్చరిస్తున్నాడు.

సంఖ్యాకాండము 1:52,53 ఇశ్రాయేలీయులు తమ తమ సేనల చొప్పున ప్రతివాడును తన తన పాళెములో తన తన ధ్వజము నొద్ద దిగవలెను. ఇశ్రాయేలీయుల సమాజముమీద కోపము రాకుండునట్లు లేవీయులు సాక్ష్యపు గుడారము చుట్టు దిగవలెను; వారు సాక్ష్యపు గుడారమును కాపాడవలెను.

ఈ వచనాలలో దేవుడు ఇశ్రాయేలీయులు తమ తమ గోత్రాల చొప్పున "పాళెములో తన తన ధ్వజము నొద్ద దిగవలెను" అని ఆజ్ఞాపించడం మనం చూస్తాం. ధ్వజము అంటే అది ఆయా గోత్రాలకు చెందిన చిహ్నం. మొదట ప్రత్యక్షగుడారం ఉంటుంది. దానిచుట్టూ లేవీయులు తమ తమ వంశాల చొప్పున గుడారాలు వేసుకుంటారు. ఆ లేవీయుల చుట్టూ మిగిలిన 11 గోత్రాల వారూ తమ తమ గుడారాలు వేసుకుంటారు. ఈవిధంగా లేవీయులు ప్రత్యక్షగుడారాన్ని కాపాడేలా దాని చుట్టూ ఉంటే మిగిలిన గోత్రాలు ఆ లేవీయులను కాపాడేలా వారి చుట్టూ ఉంటారు. ఇది యుద్ధ క్రమాన్ని సూచిస్తుంది. ఈ గోత్రాల వారిలో ఏయే గోత్రం ఎక్కడెక్కడ దిగాలో తదుపరి అధ్యాయంలో వివరించబడింది.

ఈ నియమాన్ని బట్టి మనం కూడా మన మన బాధ్యతల చొప్పున సంఘ పవిత్రతను కాపాడేవారిగా ప్రయాసపడాలి.

సంఖ్యాకాండము 1:54 యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన వాటన్నిటిని తప్పకుండ ఇశ్రాయేలీయులు చేసిరి.

ఈ వివరణ అంతా తదుపరి అధ్యాయంలో మనం చూస్తాం. వారు దేవుడు ఆజ్ఞాపించినట్టుగానే తమ తమ ధ్వజాల దగ్గర దిగుతూ భయంకరమైన ఆ అరణ్యంలో ప్రత్యక్షగుడారాన్నీ లేవీయులనూ కాపాడుతూ ముందుకు సాగారు‌.