Hits: 300
Print
రచయిత: కె విద్యా సాగర్

 లేవీయకాండము 25:1-7 మరియు యెహోవా సీనాయికొండ మీద మోషేకు ఈలాగు సెలవిచ్చెను. నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము నేను మీకిచ్చుచున్న దేశములోనికి మీరు వచ్చిన తరువాత ఆ భూమికూడ యెహోవా పేరట విశ్రాంతి కాలమును, ఆచరింపవలెను. ఆరు సంవత్సరములు నీ చేను విత్తవలెను. ఆరు సంవత్సరములు నీ ఫలవృక్ష ములతోటను బద్దించి దాని ఫలములను కూర్చుకొనవచ్చును. ఏడవ సంవత్సరము భూమికి మహా విశ్రాంతి కాలము, అనగా యెహోవా పేరట విశ్రాంతి సంవత్సర ముగా ఉండవలెను. అందులో నీ చేను విత్త కూడదు; నీ ఫలవృక్షములతోటను శుద్ధిపరచకూడదు. నీ కారుచేల పంటను కోసికొనకూడదు, శుద్ధిపరచని నీ వృక్షఫలములను ఏరుకొనకూడదు; అది భూమికి విశ్రాంతి సంవత్సరము. అప్పుడు భూమి యొక్క విశ్రాంతి సంవత్సర సస్యము నీకును నీ దాసునికిని నీ దాసికిని నీ జీతగానికిని నీతో నివసించు పరదేశికిని ఆహారమగును. మరియు నీ పశువులకును నీ దేశజంతువులకును దాని పంట అంతయు మేతగా ఉండును.

ఈ వచనాలలో దేవుడు ఆరు సంవత్సరాలు పంట విత్తాక ఏడవ సంవత్సరం ఆ భూమికి విశ్రాంతి ఇవ్వాలని ఆజ్ఞాపించడం మనం చూస్తాం. ఆ ఏడవ సంవత్సరం భూమి నుండి సహజంగా పుట్టి పండిన పంట పేదవారికీ పశువులకూ ఆహారంగా ఉంటుంది. ఈ నియమం భూమికి దేవుడే యజమానుడని ప్రజలు ఆయన భూమిలో పరదేశులని బోధిస్తుంది. అలాగే ఏడవ సంవత్సరపు ఆహారం నిమిత్తం ఆయనపై ఆధారపడడం కూడా నేర్పిస్తుంది.‌

లేవీయకాండము 25:8-13 మరియు ఏడు విశ్రాంతి సంవత్సరములను, అనగా ఏడేసి యేండ్లుగల సంవత్సరములను లెక్కింపవలెను. ఆ యేడు విశ్రాంతి సంవత్సరములకాలము నలుబది తొమ్మిది సంవత్సరములగును. ఏడవ నెల పది యవనాడు మీ స్వదేశమంతట శృంగనాదము చేయవలెను. ప్రాయశ్చిత్తార్థదినమున మీ దేశమంతట ఆ శృంగనాదము చేయవలెను. మీరు ఆ సంవత్సరమును, అనగా ఏబదియవ సంవత్స రమును పరిశుద్ధపరచి మీ దేశవాసులకందరికి విడుదల కలిగినదని చాటింపవలెను; అది మీకు సునాదముగానుండును; అప్పుడు మీలో ప్రతివాడు తన స్వాస్థ్యమును తిరిగి పొందవలెను; ప్రతివాడు తన కుటుంబమునకు తిరిగి రావలెను. ఆ సంవత్సరము, అనగా ఏబదియవ సంవత్సరము మీకు సునాదకాలము. అందులో మీరు విత్త కూడదు కారుపంటను కోయకూడదు శుద్ధిపరచని నీ ఫల వృక్షముల పండ్లను ఏరుకొనకూడదు. అది సునాదకాలము; అది మీకు పరిశుద్ధమగును, పొలములో దానంతట అదే పండిన పంటను మీరు తినెదరు. ఆ సునాద సంవత్సరమున మీలో ప్రతివాడు తన స్వాస్థ్యమును మరల పొందవలెను.

ఈ వచనాల ప్రకారం ఏడు సంవత్సరాలను ఏడుసార్లు లెక్కిస్తే 49 సంవత్సరాలు ఔతుంది. 50వ సంవత్సరాన్ని జూబిలీ అంటారు. ఆ సంవత్సరం ప్రాయశ్చిత్త దినాన శృంగనాదం చెయ్యాలి. ఆ సమయంలో భూమిని అమ్మినవారు మరలా దానిని పొందుకుంటారు. ఎందుకంటే ఇశ్రాయేలీయులు భూమిని శాశ్వత విక్రయం చెయ్యకూడదు (లేవీకాండము 25:23). ప్రతీ ఏడవ సంవత్సరం లానే ఆ సంవత్సరం కూడా భూమికి విశ్రాంతి ఇవ్వాలి. ప్రాముఖ్యంగా ఈ జూబిలీ సంవత్సరంలో బానిసలు స్వతంత్రులు ఔతారు. ఇది క్రీస్తులో విశ్వాసులు తమ పాపాలనుండి విడిపించబడి స్వతంత్రులు అవ్వడానికి ఛాయగా ఉంది.‌

లేవీయకాండము 25:13-17 ఆ సునాద సంవత్సరమున మీలో ప్రతివాడు తన స్వాస్థ్యమును మరల పొందవలెను. నీవు నీ పొరుగువానికి వెలకు ఇచ్చిన దేని విషయములోకాని నీ పొరుగువాని దగ్గర నీవు కొనిన దేని విషయములో కాని మీరు ఒకరినొకరు బాధింపకూడదు. సునాద సంవత్సరమైన తరువాత గడచిన యేండ్ల లెక్క చొప్పున నీ పొరుగు వానియొద్ద నీవు దానిని కొనవలెను. పంటల లెక్కచొప్పున అతడు నీకు దానిని అమ్మవలెను. ఆ సంవత్సరముల లెక్క హెచ్చినకొలది దాని వెల హెచ్చింపవలెను, ఆ సంవత్సరముల లెక్క తగ్గినకొలది దాని వెల తగ్గింపవలెను. ఏలయనగా పంటల లెక్కచొప్పున అతడు దాని నీకు అమ్మును గదా. మీరు ఒకరి నొకరు బాధింపక నీ దేవునికి భయపడవలెను. నేను మీ దేవుడనైన యెహోవాను.

ఈ వచనాల ప్రకారం జూబిలీ సంవత్సరంలో తమ భూములను అమ్ముకున్నవారంతా దానిని తిరిగిపొందుతారు. అందుకే కొనేవారు కూడా జూబిలీ సంవత్సరానికి ఇంకా ఎన్ని సంవత్సరాలు ఉన్నాయి అనేదానిని లెక్కించే భూమిని కొనాలి. ఉదాహరణకు తర్వాత సంవత్సరమే జూబిలీ ఐతే అమ్మకానికి వచ్చిన భూమిని ఈ సంవత్సరం పండే పంటను బట్టే కొనాలి. అదే జూబిలీకి పది సంవత్సరాలు ఉంటే పది సంవత్సరాల పంటను బట్టి కొనాలి. ఏదేమైనా జూబిలీ సంవత్సరంలో అమ్మబడిన ప్రతీ భూమినీ తిరిగి యజమానుడికి అప్పగించాలి. ఈ నియమం పాటిస్తే ఎవరూ తమ భూములను శాశ్వతంగా కోల్పోయి పేదలు అవ్వరు‌.

లేవీయకాండము 25:18-22 కాబట్టి మీరు నా కట్టడలను నా విధులను గైకొని వాటి ననుసరించి నడుచుకొనవలెను. అప్పుడు మీరు ఆ దేశములో సురక్షితముగా నివసించెదరు, ఆ భూమి ఫలించును. మీరు తృప్తిగా భుజించి దానిలో సురక్షితముగా నివసించెదరు. ఏడవ యేట మేము ఏమి తిందుము? ఇదిగో మేము చల్లను పంటకూర్చను వల్లగాదే అనుకొందురేమో. అయితే నేను ఆరవయేట నా దీవెన మీకు కలుగునట్లు ఆజ్ఞాపించెదను; అది మూడేండ్ల పంటను మీకు కలుగజేయును. మీరు ఎనిమిదవ సంవత్సరమున విత్తనములు విత్తి తొమ్మిదవ సంవత్సరము వరకు పాత పంట తినెదరు; దాని పంటను కూర్చు వరకు పాత దానిని తినెదరు.

ఈ వచనాల ప్రకారం ఇశ్రాయేలీయులు ఆయన నియమించిన ఈ కట్టడలను పాటిస్తే భూమిని విశ్రాంతిగా విడిచిపెట్టవలసిన ఏడవ సంవత్సరానికి ముందు సంవత్సరం అనగా ఆరవ సంవత్సరం ఆయన భూమిని మూడు సంవత్సరాలకు సరిపడా పంటను పండిస్తాడు. ఇది గొప్ప అద్భుతం.

లేవీయకాండము 25:23-28 భూమిని శాశ్వత విక్రయము చేయకూడదు. ఆ భూమి నాదే, మీరు నాయొద్ద కాపురమున్న పరదేశులు. మీ స్వాస్థ్యమైన ప్రతి పొలము మరల విడిపింపబడు నట్లుగా దాని అమ్ముకొనవలెను. నీ సహోదరుడు బీదవాడై తన స్వాస్థ్యములో కొంత అమ్మిన తరువాత అతనికి సమీప బంధువుడు విడిపింప వచ్చినయెడల తన సహోదరుడు అమ్మినదానిని అతడు విడి పించును. అయితే ఒకడు సమీపబంధువుడు లేకయే దాని విడిపించుకొనుటకు కావలసిన సొమ్ము సంపాదించిన యెడల దానిని అమ్మినది మొదలుకొని గడచిన సంవత్సర ములు లెక్కించి యెవరికి దానిని అమ్మెనో వారికి ఆ శేషము మరల ఇచ్చి తన స్వాస్థ్యమును పొందును. అతనికి దాని రాబట్టుకొనుటకై కావలసిన సొమ్ము దొరకని యెడల అతడు అమ్మిన సొత్తు సునాద సంవత్సరము వరకు కొనిన వాని వశములో ఉండవలెను. సునాద సంవత్సరమున అది తొలగిపోవును; అప్పుడతడు తన స్వాస్థ్యమును మరల నొందును.

ఈ వచనాల ప్రకారం ఎవరైనా భూమిని అమ్మినప్పుడు జూబిలీ సంవత్సరానికి ఉన్న సంవత్సరాల లెక్కను బట్టి కొంటారు కాబట్టి దానిని తిరిగి సంపాదించుకోవాలంటే ఆ సంవత్సరాల లెక్కను బట్టి చెల్లించి సంపాదించుకోవచ్చు. ఆ పని అమ్మిన వ్యక్తి బంధువుడు కూడా చెయ్యవచ్చు. అలాకాని పక్షంలో జూబిలీ సంవత్సరం వరకూ వేచియుండి అప్పుడు దానిని సంపాదించుకుంటాడు. దీనంతటికీ కారణం "భూమిని శాశ్వత విక్రయము చేయకూడదు. ఆ భూమి నాదే, మీరు నాయొద్ద కాపురమున్న పరదేశులు" అనే నియమం.

లేవీయకాండము 25:29-34 ఒకడు ప్రాకారముగల ఊరిలోని నివాసగృహమును అమ్మినయెడల దాని అమ్మినదినము మొదలుకొని నిండు సంవత్సరములోగా దాని విడిపింపవచ్చును; ఆ సంవత్సర దినములోనే దాని విడిపించుకొనవచ్చును. అయితే ఆ సంవత్సరదినములు నిండకమునుపు దాని విడిపింపనియెడల ప్రాకారముగల ఊరిలోనున్న ఆ యిల్లు కొనినవానికి వాని తరతర ములకు అది స్థిరముగానుండును. అది సునాద కాలమున తొలగిపోదు. చుట్టును ప్రాకారములులేని గ్రామములలోని యిండ్లను వెలిపొలములుగా ఎంచవలెను. అవి విడుదల కావచ్చును; అవి సునాదకాలములో తొలగి పోవును. అయితే లేవీయుల పట్టణములు, అనగా వారి స్వాధీన పట్టణములలోని యిండ్లను విడిపించుటకు అధి కారము లేవీయులకు శాశ్వతముగా ఉండును. లేవీయుల పట్టణముల యిండ్లు ఇశ్రాయేలీయుల మధ్యనున్న వారి స్వాస్థ్యము గనుక ఒకడు లేవీయులయొద్ద ఇల్లు సంపాదించిన యెడల పిత్రార్జిత పట్టణములో అమ్మబడిన ఆ యిల్లు సునాద సంవత్సరమున తొలగిపోవును. వారు తమ పట్టణముల ప్రాంతభూములను అమ్ముకొనకూడదు; అవి వారికి శాశ్వత స్వాస్థ్యము.

ఈ వచనాలలో ఇళ్ళ అమ్మకాలను గురించిన కట్టడను మనం చూస్తాం. ఇశ్రాయేలీయుల్లో ఎవరైనా ప్రాకారం గల పట్టణంలోని ఇళ్ళు అమ్మితే దానిని సంవత్సరంలోపే విడిపించుకోవాలి. లేదంటే ఇళ్ళు జూబిలీ సంవత్సరంలో కూడా విడిపించబడదు. కొనుక్కున్నవాడికే శాశ్వతంగా ఉంటుంది. అయితే లేవీయులకు మాత్రం ఇందులో మినహాయింపు ఉంది. వారు తమ ఇళ్ళను ఎప్పుడైనా విడిపించుకోవచ్చు, లేనిపక్షంలో జూబిలీ సంవత్సరంలో అది విడిపించబడుతుంది‌‌. లేవీయులకు ఆయన మిగిలిన గోత్రాల వలే స్వాస్థ్యాన్ని ఇవ్వలేదు కాబట్టి ఆ గోత్రాలలో కేటాయించబడిన స్థలాలలోనే వారు నివసిస్తారు కాబట్టి దేవుడు వారికి ఈ మినహాయింపు కల్పించాడు.

లేవీయకాండము 25:35-38 పరవాసియైనను అతిథియైనను నీ సహోదరుడొకడు బీదవాడై నిరాధారుడై నీయొద్దకు వచ్చినయెడల నీవు వానికి సహాయము చేయవలెను; అతడు నీవలన బ్రదుక వలెను. నీ దేవునికి భయపడి వానియొద్ద వడ్డినైనను తీసి కొనకూడదు; నీ సహోదరుడు నీవలన బ్రదుకవలెను. నీ రూకలు వానికి వడ్డికియ్యకూడదు; నీ ఆహారమును వానికి లాభమున కియ్యకూడదు. నేను మీకు కనాను దేశమునిచ్చి మీకు దేవుడగునట్లు ఐగుప్తుదేశములో నుండి మిమ్మును రప్పించిన మీ దేవుడనైన యెహోవాను.

ఈ వచనాలలో ఇశ్రాయేలీయుల్లోని పేదవారిపట్ల వారు చూపించవలసిన దయ గురించి మనం చూస్తాం. వారికి వడ్డీకి అప్పు ఇవ్వకూడదు, చెయ్యవలసిన సహాయం చెయ్యాలి. ఈ నియమం మనకు కూడా వర్తిస్తుంది. మనం సంఘంలో బీదవారైన సహోదరుల పట్ల ఇలానే ప్రవర్తించాలి.

లేవీయకాండము 25:39-46 నీయొద్ద నివసించు నీ సహోదరుడు బీదవాడై నీకు అమ్మబడినయెడల వానిచేత బానిససేవ చేయించుకొన కూడదు. వాడు జీతగానివలెను పరవాసివలెను నీయొద్ద నివసించు సునాద సంవత్సరము వరకు నీ యొద్ద దాసుడుగా ఉండవలెను. అప్పుడతడు తన పితరుల స్వాస్థ్యమును మరల అనుభవించునట్లు తన పిల్లలతో కూడ నీయొద్ద నుండి బయలుదేరి తన వంశస్థులయొద్దకు తిరిగి వెళ్లవలెను. ఏలయనగా వారు నాకే దాసులైయున్నారు, నేను ఐగుప్తులో నుండి వారిని రప్పించితిని; దాసులను అమ్మినట్లు వారిని అమ్మకూడదు; నీ దేవునికి భయపడి అట్టివానిని కఠిన ముగా చూడకుము. మీ చుట్టుపట్లనున్న జనములలో నుండి దాసీలను దాసులను కొనవచ్చును. మరియు మీ మధ్య నివసించు పరదేశులను నీ దేశములో వారికి పుట్టిన వారిని కొనవచ్చును; వారు మీ సొత్తగుదురు. మీ తరువాత మీ సంతతివారికి స్వాస్థ్యముగా ఉండునట్లు మీరు ఇట్టివారిని స్వతంత్రించుకొనవచ్చును; వారు శాశ్వతముగా మీకు దాసులగుదురు కాని, ఇశ్రాయేలీయులైన మీరు సహోదరులు గనుక ఒకని చేత ఒకడు కఠినసేవ చేయించు కొనకూడదు.

ఈ వచనాల ప్రకారం ఇశ్రాయేలీయుల్లో ఎవరైనా దాసుడిగా అమ్మబడితే అతని చేత కఠినసేవ చేయించుకోకూడదు, శాశ్వతంగా దాసునిగా చేసుకోకూడదు. ఎందుకంటే ఇశ్రాయేలీయులు దేవునికే దాసులు కాబట్టి జూబిలీ సంవత్సరంలో ఆ దాసులకు విడుదల ప్రకటించాలి. ఒకవేళ ఎవర్నైనా శాశ్వతంగా పనికి పెట్టుకోవాలంటే అన్యుల నుండి కొనుక్కోవాలి. అన్యులు దేవునికి దాసులు కారు కాబట్టి వారిని శాశ్వతంగా దాసులుగా ఉంచుకోవచ్చు‌. ఈ నియమం క్రీస్తు నందు ఉన్నవారికి మాత్రమే స్వాతంత్ర్యం కలుగుతుంది అనడానికి సాదృష్యంగా ఉంది.

లేవీయకాండము 25:47-55 పరదేశియే గాని నీయొద్ద నివసించువాడే గాని ధనసంపాదనము చేసికొనునప్పుడు అతనియొద్ద నివసించు నీ సహోదరుడు బీదవాడై నీయొద్ద నివసించు ఆ పరదేశికైనను ఆ పరదేశి కుటుంబములో వేరొకని కైనను తన్ను అమ్ముకొనిన యెడల తన్ను అమ్ము కొనిన తరువాత వానికి విడుదల కావచ్చును. వాని సహోదరులలో ఒకడు వానిని విడి పింపవచ్చును. వాని పినతండ్రియేగాని పినతండ్రి కుమారుడేగాని వాని వంశములో వాని రక్తసంబంధియేగాని వాని విడిపింపవచ్చును. కావలసిన క్రయధనము వానికి దొరికిన యెడల తన్నుతాను విడిపించుకొనవచ్చును. అప్పుడు వాడు అమ్మబడిన సంవత్సరము మొదలు కొని సునాద సంవత్సరము వరకు తన్ను కొనినవానితో లెక్కచూచుకొన వలెను. వాని క్రయధనము ఆ సంవత్సరముల లెక్కచొప్పున ఉండవలెను. తాను జీతగాడైయుండిన దినముల కొలది ఆ క్రయధనమును తగ్గింపవలెను. ఇంక అనేక సంవత్సరములు మిగిలి యుండినయెడల వాటిని బట్టి తన్ను అమ్మిన సొమ్ములో తన విమోచన క్రయధనమును మరల ఇయ్యవలెను. సునాద సంవత్సరమునకు కొన్ని సంవత్సరములే తక్కువైన యెడల అతనితో లెక్కచూచుకొని సంవత్సరముల లెక్కచొప్పున తన విమోచనక్రయధనమును అతనికి చెల్లింపవలెను. ఏటేటికి జీతగానివలె వాడతనియొద్ద ఉండవలెను. అతడు మీ కన్నులయెదుట వానిచేత కఠినముగా సేవ చేయించకూడదు. అతడు ఈ రీతిగా విడిపింపబడనియెడల సునాద సంవత్సరమున వాడు తన పిల్లలతో కూడ విడుదలనొందును. ఏలయనగా ఇశ్రాయేలీయులు నాకే దాసులు; నేను ఐగుప్తుదేశములో నుండి రప్పించిన నా దాసులే. నేను మీ దేవుడనైన యెహోవాను.

ఈ వచనాలలో కూడా ఇశ్రాయేలీయుల్లో ఒకర్ని దాసులుగా కొన్నప్పుడు వారు ఏ విధంగా విమోచించబడాలో మనం చూస్తాం. భూమి తరహాలోనే జూబిలీ సంవత్సరానికి ముందున్న సంవత్సరాల లెక్కను చెల్లించి అతను విడిపించబడవచ్చు. స్వతహాగా కానీ బంధువుల సహాయం వల్ల కానీ అలా చెయ్యవచ్చు. లేదా జూబిలీలో స్వతంత్రుడు కావొచ్చు‌. శాశ్వతంగా మాత్రం దాసుడు కాడు. ఎందుకంటే ఇశ్రాయేలీయులంతా దేవునికే దాసులు. ఈ జూబిలీ నియమం ఇశ్రాయేలీయుల్లో గొప్ప సామాజిక సంస్కరణ తీసుకువచ్చింది. దీనివల్ల ఎవరూ శాశ్వతంగా తమ భూమిని కోల్పోలేరు, శాశ్వతంగా ఎవరికీ దాసులు కాలేరు.