కొత్త నిబంధన
రచయిత: పి. శ్రావణ్ కుమార్

1:1, 1:2, 1:3, 1:4, 1:5, 1:6, 1:7, 1:8, 1:9, 1:10,11, 1:12, 1:13

పత్రిక పరిచయం

ఈ పత్రికలో యోహాను క్రీస్తు విరోధుల గురించి, అనగా యేసుక్రీస్తు బోధను విడిచి వెళ్లేవారి గురించి మాట్లాడుతున్నాడు. క్రీస్తు బోధలో నిలిచి ఉండడమే నిజంగా యేసుక్రీస్తుకు శిష్యులుగా ఉండటం అని, యేసుక్రీస్తు శరీరధారణని గాని, ఆయన దైవత్వాన్ని గాని తిరస్కరించే వారు ఆయన శిష్యులు కాదు అని మనం తెలుసుకోవాలి. ఈ విషయాన్నే అపొస్తలుడు ఈ పత్రికలో వివరించాడు. ఈ పత్రికలో ప్రాముఖ్యంగా క్రీస్తు శరీరధారణని తిరస్కరించే వారి గురించి చెప్పబడినప్పటికీ, వీరు మాత్రమే కాకుండా వాక్యాన్ని ఏ విధంగా వక్రీకరించే వాళ్ళు అయినా క్రీస్తుకి ఆయన సువార్తకు విరోధులు అని గమనించాలి.

ఏ పత్రికనైనా చదివేటప్పుడు, ఎవరు రాసారు? ఎప్పుడు రాసారు? ఎవరికి రాసారు? ఎందుకు రాసారు? అనే విషయాలు గ్రహించడం చాలా ప్రాముఖ్యం. ఈ పత్రిక ఎందుకు రాసారు అనే విషయాలు పై భాగంలో క్లుప్తంగా వివరించబడింది, ప్రతి వచనానికి ఇవ్వబడిన వ్యాఖ్యానం చదివినప్పుడు ఈ విషయాన్ని మనం ఇంకా ఎక్కువగా తెలుసుకుంటాం. ఈ పత్రిక ఎవరికి రాసారు అని విషయం మొదటి వచనం లో సమగ్రంగా వివరించబడింది. ఇక్కడ ఈ పత్రికని "ఎవరు రాసారు?" అనే ప్రశ్నకు వివరణ తెసులుసుకుందాం.

ఒక పత్రికని ఎవరు రాసారు అని తెలుసుకోవడానికి మనం రెండు రకాల ఆధారాలని గుర్తించాలి:

a) అంతర్గత సాక్ష్యం (Internal Evidence)

b) వెలపలి సాక్ష్యం (External Evidence)

a) అంతర్గత సాక్ష్యం (Internal Evidence) అంటే ఈ పత్రిక రాసిన రచయిత గురించి బైబిల్ లో ఇమిడి ఉన్న ఆధారాలు. ఉదాహరణకి: "యేసుక్రీస్తు అపొస్తలుడైన పేతురు" (1 పేతురు 1:1), ఇక్కడ పేతురు తానే ఈ పత్రికని రాస్తున్నాను అని తన పేరును సంబోదించాడు. అయితే ఈ పత్రికలో (2వ యోహాను), ఎవరి నుండి ఈ పత్రిక వచ్చిందో వారి పేరు సంబోధించబడలేదు. బైబిల్ లో ఈ పత్రిక రాసిన వారి గురించి ఏమి ఆధారాలు ఉన్నాయో తెలుసుకుందాం:

1) అపొస్తలత్వానికి రుజువు - "పెద్దనైనా నేను" అని ఈ పత్రిక రచయిత తన గురించి సంబోదించుకున్నాడు. అయితే "పెద్ద" అని చెప్పబడినప్పుడు ఇతను అపొస్తలుడు కాదు, ఎందుకంటే సంఘంలో పెద్దలు మరియు అపొస్తలులు వేరుగా ఉన్నారు అని అనుకోవచ్చు. అపొస్తలులు ప్రతి సంఘంలో పెద్దలను నియమించినంత మాత్రాన, అపొస్తలులు పెద్దలు కాకుండా పోరు. ఉదాహరణకు: "తోటిపెద్దను" (1 పేతురు 5:1) అని పేతురు తన పత్రికలో తన గురించి సంబోదించుకున్నాడు. దీనిని బట్టి (2వ యోహాను) రాసింది అపొస్తలుడే అయ్యిండొచ్చు అని మనం తెలుసుకోవచ్చు.

2) అపొస్తలత్వానికి రుజువు - ఈ పత్రికలో 5వ వచనం చదివినప్పుడు, ఈ పత్రిక రచయిత ఒక ఆజ్ఞను ఇస్తున్నట్టు మనం గమనించగలం; "కాగా అమ్మా, క్రొత్త ఆజ్ఞ నీకు వ్రాసినట్టు కాదు గాని మొదటనుండి మనకు కలిగిన ఆజ్ఞనే వ్రాయుచున్నాను (paraphrase added)." ప్రభువు ఇచ్చిన ఆజ్ఞలను గుర్తుచేయడం, లేదా అధికారంతో సంఘానికి ఆజ్ఞలు ఇవ్వడం అపొస్తలులు చేసిన పని (ప్రభువు, అపొస్తలులకు ఈ అధికారాన్ని ఇచ్చాడు). గనుక ఈ పత్రికలో సంఘానికి ఆజ్ఞలు ఇస్తున్నట్టు మనం చూస్తున్నాం కాబట్టి, ఈ పత్రిక అపొస్తలుడే రాసాడు అని తెసులుసుకోవచ్చు.

3) యోహానే రచయిత అనే రుజువు - ఈ పత్రిక యొక్క బాషా శైలి యోహాను సువార్త మరియు 1 యోహాను పత్రికలో ఉన్న విధంగానే ఉంది. దీనిని బట్టి ఆ రెండు పత్రికలు రాసింది (యోహాను సువార్త, 1 యోహాను పత్రిక) అపొస్తలుడైన యోహానే గనుక, ఈ పత్రిక (2 యోహాను పత్రిక) రాసింది కూడా అపొస్తలుడైన యోహాను అయ్యే అవకాశం లేకపోలేదు.

4) యోహానే రచయిత అనే రుజువు - ఈ పత్రికలో సంబోధించబడిన విషయాలు, మరియు 1 యోహాను పత్రికలో సంబోధించబడిన విషయాలు ఒకే రకంగా ఉన్నాయి. ఈ కారణాన్ని బట్టి ఈ 1 యోహాను పత్రిక "యోహాను" రాసుంటే, ఈ పత్రిక కూడా "యోహాను" రాసుండే అవకాశం ఉంది అని అర్థంచేసుకోవచ్చు. ఉదాహరణకు:

"యేసుక్రీస్తు శరీరధారియై వచ్చెనని, యే ఆత్మ ఒప్పుకొనునో అది దేవుని సంబంధమైనది; యే ఆత్మ యేసును ఒప్పుకొనదో అది దేవుని సంబంధమైనది కాదు" (1 యోహాను 1:2).

"యేసుక్రీస్తు శరీరధారియై వచ్చెనని యొప్పుకొనని వంచకులు అనేకులు లోకములో బయలుదేరి యున్నారు." (2 యోహాను 1:7)

b) వెలపలి సాక్ష్యం (External Evidence) అంటే ఈ పత్రిక రాసిన రచయిత గురించి వాక్యం (బైబిల్) వెలుపల ఉన్న ఆధారాలు.

1) యోహానే రచయిత అనే రుజువు - సంఘ పెద్దలు (church fathers) ఈ పత్రిక యోహాను రాసాడు అనే సాక్షాన్ని ఇచ్చారు. ఉదాహరణకు: ఐరేనిస్ (Irenaeus) పోలికర్ప్ (polycarp) యొక్క శిష్యుడు (పోలికర్ప్ అపొస్తలుడైన యోహాను శిష్యుడు) గనుక ఐరేనిస్ (Irenaeus) అపొస్తలుడైన యోహాను తరానికి తర్వాత వాడు అని అర్ధం అవుతోంది. అపొస్తలుడైన యోహాను రెండు పత్రికలను రాసాడు అనే సాక్షాన్ని ఐరేనిస్ (Irenaeus) ఇచ్చాడు (2 యోహాను & 3 యోహాను పత్రికలను ఒకే పత్రికగా పరిగణించే వారు).

2) యోహానే రచయిత అనే రుజువు - మొరటోరియాన్ కేనన్ (muratorian canon) లేదా మొరటోరియాన్ శకలం (muratorian fragments) అనే ప్రాచీన ప్రతులు AD 1740 సంవత్సరంలో కనుగొనబడినవి. ఇవి 7 వ శతాబ్దంలో రాయబడిన ప్రతులు అని తెలుసుకోవాలి. అయితే దీని అసలైన పత్రం 2 - 4 AD లో రాయబడింది అని చరిత్రకారులు తేల్చారు. కనుగొనబడిన ఈ ప్రతులలో, కొత్త నిబంధన పుస్తకాల పేర్లు మరియు వాటి రచయిత పేర్లు రాయబడి ఉన్నవి. అందులో, యోహాను రెండు పత్రికలు రాసాడు అనే విషయం స్పష్టంగా ఉంది. అయితే ఈ రెండు పత్రికలు ఏవి అంటే యోహాను రాసిన మొదటి రెండు పత్రికలు అయ్యుండొచ్చు, లేదా యోహాను రాసిన మొదటి మరియు మూడవ పత్రిక అయ్యుండొచ్చు. అయితే ఈ రెండు పత్రికలు అనగా మొదటి యోహాను పత్రిక మరియు రెండు/మూడు యోహాను పత్రికలు కలిపిన ఒకే పత్రిక అనే ప్రతిపాదన ఇంకా సమంజసంగా ఉంది.

ఈ పత్రికని ఎప్పుడు రాసారు? అనే విషయాన్ని గురించి పండితులలో (scholars) రెండు అభిప్రాయాలు ఉన్నాయి.

1) కొత్త నిబంధనలో ఉన్న అన్ని పత్రికలు 70 AD లోపే రాయబడినవి అని కొందరు పండితులు విశ్వసిస్తారు. ఇందుకు గల కారణం, 70 AD లో యెరూషలేము దేవాలయాన్ని రోమీయులు ద్వాంశం చేసారు, యెరూషలేము పట్టణాన్ని నాశనం చేసారు. ఒక వేళా కొత్త నిబంధలో ఉన్న ఏ పత్రికైనా 70 AD తర్వాత రాయబడియుంటే, కచ్చితంగా ఈ విషయ ప్రస్తావన చేసేవారు, ఆలా ఏ రచయిత చేయలేదు గనుక అన్ని పత్రికలు 70 AD లోపే రాయబడినవి అనేది ఈ వాదనలోని బలమైన అంశం.

2) ఈ పత్రిక 1 యోహాను పత్రికలోని అంశాలనే తెలియజేస్తుంది గనుక అదే సమయంలో అనగా AD 90 - 95 మధ్యలో రాయబడి ఉండొచ్చు అని ఇంకొందరు పండితుల వాదన.

అయితే అక్షరాలా ఈ పత్రిక రాయబడిన సమయాన్ని నిర్ధారించడం సాధ్యపడదు.

వచన వ్యాఖ్యానం

“ పెద్దనైన నేను, ఏర్పరచబడినదైన అమ్మగారికిని ఆమె పిల్లలకును శుభమని చెప్పి వ్రాయునది." 2 యోహాను 1:1

"పెద్దనైన నేను" అని యోహాను తన గురించి తాను సంబోధించుకుంటున్నాడు. తాను వయసులో పెద్దవాడు గనుక తనని తాను ఈ విధంగా సంబోధించుకొని ఉండొచ్చు. యోహాను ఈ పత్రికను ఎఫెసీ పట్టణం నుండి రాసాడు గనుక, అక్కడ ఉన్న సంఘానికి, మరియు తాను రాస్తున్న సంఘానికి (తాను పరిచర్య చేసిన ఇతర సంఘాలను కూడా) తాను పెద్దనని తెలియజేస్తున్నాడు. ఇక్కడ మీకు ఒక ప్రశ్న రావచ్చు. సంఘాలను స్థాపించి వాటిలో పెద్దలను ఏర్పరిచింది అపొస్తలులే కదా. అంటే పెద్దలు మరియు అపొస్తలులు వేరే వేరే కదా, అలాంటప్పుడు యోహాను తాను పెద్దను అని ఎలా చెప్పుకుంటున్నాడు? ఉదాహరణకు ఈ వచనాన్ని గమనించండి

“మరియు ప్రతి సంఘములో వారికి పెద్దలను ఏర్పరచి, ఉపవాసముండి, ప్రార్థనచేసి, వారు నమ్మిన ప్రభువునకు వారిని అప్పగించిరి." అపొ కార్య 14:23

ఇక్కడ అపొస్తలులు, ప్రతి సంఘంలో పెద్దలను ప్రభువు పేరట ఏర్పరిచినట్టు గమనించగలం. సంఘాలలో పెద్దలను నియమించినంత మాత్రాన అపొస్తలులు పెద్దలు కాకుండా పోరు. సార్వత్రికంగా, తాము పరిచర్య చేస్తున్న సంఘాలన్నటికి వారు పెద్దలు. పేతురు కూడా, తన మొదటి పత్రికని రాస్తూ తన గురించి తాను ఇలా సంబోధించుకున్నాడు :

“తోటిపెద్దను, క్రీస్తు శ్రమలనుగూర్చిన సాక్షిని, బయలుపరచబడబోవు మహిమలో పాలివాడనునైన నేను మీలోని పెద్దలను హెచ్చరించుచున్నాను." 1 పేతురు 5:1

"ఏర్పరచబడినదైన అమ్మగారికిని" అని అనువదించబడింది గ్రీకు పదాలు "Eklektē, kyria". చారిత్రకంగా, ఈ పదాలను అనువదించడానికి అనేకమైన ప్రాతిపదికలు ఉన్నాయి. వీటిలో ముఖ్యమైన వాటిని మనం అర్ధం చేసుకునే ప్రయత్నం చేద్దాం.

a) "Elekta" అనే పేరుగల స్త్రీకి ఈ పత్రిక రాయబడింది అని కొందరు సూచించారు. ఇలా సూచించే వారు, ఎలెక్టా (Elekta) అనే పదాన్ని నామవాచకంగా పరిగణిస్తారు. అయితే ఈ సూచన, ఇదే పత్రికలో 13వ వచనాన్ని గమనించినప్పుడు, సరైనదిగా అనిపించదు. ఎందుకంటే "ఏర్పరచబడిన (Eklektē) నీ సహోదరి పిల్లలు (2 యోహాను 1:13) " అని అన్నప్పుడు, ఎవరిగురించి మాట్లాడుతున్నాడో (నీ సహోదరి) చెప్పాడు గనుక, Eklektē అనే పదం 'విశ్లేషణమే (adjective)' గాని 'నామవాచకం' అయ్యే అవకాశం లేదు. యోహాను, ఎలెక్టా (Elekta) అనే స్త్రీకి ఈ పత్రికని రాసాడు అనే వాదన వాక్య వెలుగులో నిలబడదు.

b) "kyria" అనే గ్రీకు పదం నామవాచకంగా వాడబడింది అని 3వ శతాబ్దానికి చెందిన అతనెసిస్ (Athanasius) అనే బిషప్ ప్రతిపాదించారు. ఇది ఈ ఉత్తరం ఏర్పరచబడిన కీరియా (kyria) అనే స్త్రీకి రాయబడింది అని సూచిస్తుంది. కీరియా (kyria) అనే పదం కురియాస్ (Kyrios or kurios) అనే మూలా పదం నుండి తీయబడింది. కురియాస్ అనగా యజమానుడు లేదా ప్రభువు అని అర్ధం. కీరియా (kyria) అనే పేరు కలిగిన స్త్రీలు ఆ కాలంలో లేకపోలేదు. అయితే కొత్త నిబంధనలో ఎలెక్టా (Eklektē, ఏర్పరచబడిన) అనే పదం ఏ నామవాచకానికి జతగా కేటాయించలేదు. అంటే ఏర్పరచబడిన వారు అని ఎవరిని పేరు పెట్టి పిలువలేదు. ఉదాహరణకు: కొత్త నిబంధనలో ఏర్పరచబడిన తిమోతి, ఏర్పరచబడిన తీతు అని గాని మరి వేరే ఎవరిని గాని ఈ విధంగా సంబోధించలేదు. ఒక్క మినహాయింపు రోమా 16:13 లో గమనించగలం. అక్కడ "ఏర్పరచబడిన రూఫునకు" అని సంబోధించబడింది. కొత్త నిబంధనకి వెలుపట "కీరియా" అనే పదం "యజమానురాలు", "స్త్రీ" అని తరచుగా వాడబడింది. గ్రీకు సెప్తుగ్గింట్ (septuagint) లో ఈ పదం అనేకసార్లు వాడబడింది, ఉదాహరణకి : శారయి, హగ్గరు యొక్క యజమానురాలు (kyria) అనే సందర్భంలో ఉపయోగించబడింది. సారెపతు విధవరాలు, తన ఇంటికి తానె యజమానురాలు అని చెప్పే సందర్భంలో ఉపయోగించబడింది, నయమాను భార్యని సంబోదించడానికి కూడా ఈ పదం ఉపయోగించబడింది, ఇంకా అనేకసార్లు యజమానురాలు అని మాట్లాడే సందర్భంలో చాలా తరచుగా ఈ పదం వాడబడింది గనుక, ఇక్కడ యోహాను చెప్తున్నా కీరియా అనే పదం నామవాచకంగా పరిగణించాలాలి అనే వాదన ఊహాజనితమే.

c) ఈ ఉత్తరం ఒక స్త్రీకి రాయబడింది, కానీ తన పేరును యోహాను బహిర్గతం చేయలేదు అనేది మరొక ప్రతిపాదన. ఈ ఉత్తరం ఫిలేమోను పత్రిక లాగ ఒకరికే రాయబడి ఉంటె, ప్రతి చోట "క్రియ (verb)" ఏకవచంలోనే ఉండాలి, అయితే ఈ పత్రికలో అనేక చోట్ల "క్రియ (verb)" బహువచనంలో వాడబడింది. దీనిని బట్టి ఈ పత్రిక లో చెప్పబడిన సంగతులు సామూహిక భావం కలిగివున్నాయి గనుక, ఈ ఉత్తరం ఆ స్త్రీకి మాత్రమే అని పరిగణించడం వీలు పడదు.

d) యోహాను "elect lady" (ఏర్పరచబడిన అమ్మగారికి) అని చెప్పినప్పుడు, ఇది ఒక ప్రత్యేకమైన స్త్రీని గురించి మాట్లాడట్లేదు గాని, తాను రాస్తున్న సంఘానికి సూచనగా ఉంది అనేది మరొక వాదన.

e) మరి కొందరు ఇక్కడ పేర్కోబడిన "ఏర్పరచబడిన అమ్మగారికి" అనేది యేసు తల్లి అయిన మరియే అని వాదిస్తారు. దీనికి వీరు చూపించే ఆధారం "సత్యము ఎరిగినవారందరును మిమ్మును ప్రేమిస్తున్నాము" అని ఇదే పత్రిక రెండవ వచములో చెప్పబడిన మాట. అందరు ప్రేమించే స్త్రీ ఎవరైనా ఉన్నారా? యేసు తల్లి అయిన మరియ తప్ప? అనేది వీరి వాదన. అంత మాత్రమే కాకుండా ఇదే పత్రిక చివరి వచనంలో "ఏర్పరచబడిన నీ సహోదరి పిల్లలు" అన్నప్పుడు, మరియకు సహోదరి ఉంది కదా అని కూడా వీరు వాదిస్తారు.

యోహాను ఈ పత్రికని సంఘానికి రాసాడు అని నేను వ్యక్తిగతంగా నమ్ముతున్నాను. అయితే దీనిని మనం వ్యక్తిగత పత్రికగా అంగీకరించినా లేక సంఘానికి రాసిన పత్రికగా అంగీకరించినా ఈ పత్రికలో చెప్పబడిన విషయాలను వ్యాఖ్యానించడంలో ఎలాంటి వ్యత్యాసం ఉండదు.

“ నేనును, నేను మాత్రమే గాక సత్యము ఎరిగినవారందరును, మనలో నిలుచుచు మనతో ఎల్లప్పుడు ఉండు సత్యమునుబట్టి మిమ్మును నిజముగా ప్రేమించుచున్నాము." 2 యోహాను 1:2

నేనును, అనగా అపొస్తలుడను, పెద్దనునైన యోహాను; మరియు సత్యాన్ని ఎరిగి ఈ పత్రిక రాయబడిన సంఘం గురించి తెలిసిన వారందరు మిమ్మును నిజముగా ప్రేమిస్తున్నాము అని చెప్తున్నాడు. అయితే, "సత్యము ఎరిగినవారందరును" అని యోహాను చెప్పినప్పుడు, ఆ సమయంలో భూమి మీద నివసించే విశ్వాసులు అందరు అని అర్ధం చేసుకోవడం పొరపాటు అవుతుంది. దీనిని మనం, యోహానుతో పాటు ఉంటూ, ఆ పత్రిక రాయబడిన సంఘం గురించి తెలిసిన వారు అని అర్ధం చేసుకోవాలి. అయితే యోహాను మరియు ఇతర విశ్వాసులు ఆ సంఘాన్ని ప్రేమించడానికి తోడ్పడే ప్రేరణ ఏంటి అని మనం ఆలోచిస్తే "మనలో నిలుచుచు మనతో ఎల్లప్పుడు ఉండు సత్యమునుబట్టి" అని పై వచనంలో గమనించొచ్చు. అయితే ఈ మాటను కొంచెం ఆలోచన చేద్దాం. దేవుడు, సువార్త ద్వారా మనలను రక్షించి, తన సత్యస్వరూపి యగు ఆత్మను మనకు అనుగ్రహించాడు.

“ నేను తండ్రిని వేడుకొందును, మీయొద్ద ఎల్లప్పుడు నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను, అనగా సత్యస్వరూపి యగు ఆత్మను మీకనుగ్రహించును. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు గనుక ఆయనను పొంద నేరదు; మీరు ఆయనను ఎరుగుదురు. ఆయన మీతో కూడ నివసించును, మీలో ఉండును." యోహాను 14:16,17

యోహాను ఇక్కడ ఈ విషయాన్ని గురించే ప్రస్తావిస్తున్నాడు, అందుకే "మనలో నిలుచుచు మనతో ఎల్లప్పుడు ఉండు" అనే మాటను "సత్యమునుబట్టి" అనే మాటకు జోడించాడు. దీనిని బట్టి యోహానును, మరియు తనతో ఉన్న విశ్వాసులను, ఈ పత్రిక అందుకున్న సంఘాన్ని ప్రేమించేలా ప్రేరేపించింది, వారిలో నివసించే "సత్యస్వరూపి యగు ఆత్మ" అని అర్ధం చేసుకోవచ్చు. ఇక్కడ యోహాను నిజమైన విశ్వాసులు ఒకే సత్యాన్ని బట్టి ఏకంగా ఉన్నారని, ఆ సత్యాన్ని బట్టే ఒకరిని ఒకరు ప్రేమించుచున్నారని చెప్తున్నాడు. ఈ సత్యమే సువార్త సత్యము, యేసుక్రీస్తును గురించిన వాక్యము.

“ సత్యప్రేమలు మనయందుండగా తండ్రియైన దేవుని యొద్దనుండియు, తండ్రియొక్క కుమారుడగు యేసుక్రీస్తునొద్దనుండియు కృపయు కనికరమును సమాధానమును మనకు తోడగును." 2 యోహాను 1:3

ఇక్కడ యోహాను "సత్యప్రేమలు మనయందుండగా" అని అంటున్నాడు. ఈ సత్య ప్రేమలు తమ జీవితంలో కలిగి ఉన్నవారికి మాత్రమే దేవుని (తండ్రి మరియు కుమారుని) నుండి వచ్చే "కృప, కనికరము, సమాధానము" అనేవి తోడుంటాయి అని మనం అర్ధం చేసుకోవాలి. సత్య ప్రేమలు కలిగి ఉండడం అంటే, నిజమైన రక్షణ మరియు విశ్వాసం కలిగి ఉండడమే. "నేనే సత్యము, మార్గము, జీవము" అని యేసయ్య చెప్పాడు; ప్రభువే సత్యమని, ఆ సత్యాన్ని తెలుసుకోవడాన్ని బట్టే మనకు రక్షణ వస్తుందని; మనము ఆయనను ముందు ప్రేమించలేదు గాని ఆయనే మనలను ముందుగా ప్రేమించాడు గనుక, ఆయన ప్రేమను తెలుసుకున్న మనం పరిశుద్దాత్ముని శక్తిని బట్టి క్రీస్తు ప్రేమతో నింపబడ్డాము అని గ్రహించాలి.

ఇక్కడ యోహాను సంబోధిస్తున్న "కృపయు కనికరమును సమాధానము" రక్షణ పొందుకోవడానికి కాదు గాని, రక్షింపబడిన వారు దేవుని జ్ఞానములొ ఎదగటానికి, మరియు క్రీస్తు స్వరూప్యములోకి మారటానికి అని అర్ధం చేసుకోవాలి.

“తండ్రివలన మనము ఆజ్ఞను పొందినప్రకారము నీ పిల్లలలో కొందరు సత్యమును అనుసరించి నడుచుచుండుట కనుగొని బహుగా సంతోషించుచున్నాను." 2 యోహాను 1:4

ఇక్కడ యోహాను "బహుగా సంతోషిస్తున్నట్టుగా" మనం గమనిస్తున్నాం. ఎందుకు యోహాను ఇలా సంతోషిస్తున్నాడు అని మనం ఆలోచిస్తే అదే వచనంలో "నీ పిల్లలలో కొందరు సత్యమును అనుసరించి నడుస్తున్నారు" అని సమాదానాన్ని చూస్తున్నాం. దేవుని పిల్లలకు ఉండే ఈ అతి ప్రాముఖ్యమైన లక్షణాన్ని మనం సరిగా అర్ధం చేసుకోవాలి. ఎవరు సత్యాన్ని అనుకరించి నడుస్తారు అంటే, "సత్యస్వరూపియైన ఆత్మను" పొందుకున్న వారే అని లేఖనాల నుండి తెలుసుకుంటున్నాం.

“తండ్రియొద్దనుండి మీ యొద్దకు నేను పంపబోవు ఆదరణకర్త, అనగా తండ్రి యొద్దనుండి బయలుదేరు సత్యస్వరూపియైన ఆత్మ వచ్చి నప్పుడు ఆయన నన్ను గూర్చి సాక్ష్యమిచ్చును." యోహాను సువార్త 15:26

పై వచనాన్ని బట్టి పరిశుద్దాత్మ దేవునికి ఉన్న మరొక పేరే "సత్యస్వరూపియైన ఆత్మ" అని తెలుస్తుంది. రక్షణ పొందిన వాళ్ళు పరిశుద్దాత్మను పొందుకున్న వారు, మరియు పరిశుదాత్మతో నింపబడిన వారు గనుక, పరిశుద్దాత్ముడు యేసుక్రీస్తు బయలు పరిచిన విషయాలను మనం అనుసరించేలా సహాయపడతాడు అని లేఖనాలు సెలవిస్తున్నాయి. దీనిని బట్టి, సత్యస్వరూపియైన ఆత్మతో నింపబడిన వారు మాత్రమే, దేవుని సత్యాన్ని (అనగా దేవుడు తన వాక్యంలో బయలు పరిచిన సత్యాన్ని) అనుసరిస్తారు. ఇక్కడ యోహాను అదే విషయాన్ని చెప్తున్నాడు. తాను ఏ సంఘానికి అయితే పత్రికని రాస్తున్నాడో, ఆ సంఘంలోని కొందరి గురించి సమాచారం కలిగిన యోహాను, వారు ప్రభువులో స్థిరంగా నడవటం చూసి బహుగా సంతోషిస్తున్నాడు.

సత్యనుసారంగా నడుకోవడం నిజమైన క్రైస్తవుడు అని చెప్పడానికి నిదర్శనం, వారు వెలుగు సంబంధులు గనుక, చీకటి క్రియలలో పాలు పంచుకోక, వెలుగులోనే నడుచుకుంటారు. ఇక్కడ యోహాను "నీ పిల్లలు" అని సంబోదిస్తున్నాడు, ఎవరు వీరు అని మనం ఆలోచన చేస్తే:

1) యోహాను తాను వాక్యపరిచర్య చేసిన సంఘాలకు అనుసంధానంగా ఉన్న ఒక చిన్న సంఘాన్ని సంబోదిస్తున్నాడు అని అనేకమంది వ్యాఖ్యానకర్తల అభిప్రాయం.

2) మరికొందరు వ్యాఖ్యానకర్తలు, ఈ పత్రిక ఒక స్త్రీకి మరియు తన పిల్లలకి అని సంబోధించబడింది గనుక, యోహాను ఆ పిల్లల గురించి మాత్రమే మాట్లాడుతున్నాడు అని చెప్తారు.

3) మరికొందరు వ్యాఖ్యానకర్తలు, ఈ పత్రిక సంఘంలో అధికార స్థానంలో ఉన్న ఒక స్త్రీకి రాయబడింది గనుక, యోహాను సంబోధించే పిల్లలు, ఆ స్త్రీ సొంత పిల్లలు మరియు సంఘము లోని విశ్వాసులు అని వ్యాఖ్యానిస్తారు.

ఈ విషయంలో వ్యాఖ్యానకర్తల్లో అభిప్రాయం బేధాలు ఉన్నప్పటికీ, ఈ వచనం నుండి అన్వయించుకునే సూత్రం మాత్రం "దేవుని పిల్లలు (సత్యస్వరూపియైన ఆత్మను కలిగిన వారు) సత్యాన్ని బట్టి నడుచుకుంటారు."

“కాగా అమ్మా, క్రొత్త ఆజ్ఞ నీకు వ్రాసినట్టు కాదు గాని మొదటనుండి మనకు కలిగిన ఆజ్ఞనే వ్రాయుచు, మనము ఒకరి నొకరము ప్రేమింపవలెనని నిన్ను వేడుకొనుచున్నాను." 2 యోహాను 1:5

ఇక్కడ అపొస్తలుడు "ఒకరి నొకరము ప్రేమింపవలెనని" చెప్తున్నాడు. అయితే ఈ ఆజ్ఞ క్రొత్తది కాదు అని తానే చెప్తున్నాడు. ఇక్కడ క్రొత్తది కాదు అంటే దాని ఉద్దేశం, ఇది యోహానుకి ప్రత్యేకంగా ఆ పత్రిక రాస్తున్న సమయంలో బయలుపరచబడిన విషయం కాదు అని గ్రహించాలి. యేసు క్రీస్తు ప్రభువు ఇచ్చిన ఆజ్ఞను మనం గమనిస్తే;

“నేను మిమ్మును ప్రేమించిన ప్రకారము, మీరొకని నొకడు ప్రేమించ వలెననుటయే నా ఆజ్ఞ." యోహాను సువార్త 15:12

మీరు ఒకరి నొకరు ప్రేమింపవలెనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను; నేను మిమ్మును ప్రేమించి నట్టే మీరును ఒకరి నొకరు ప్రేమింపవలెను." యోహాను సువార్త 13:34

పై వచనాలలో యేసు క్రీస్తు ప్రభువు ఇచ్చిన ఆజ్ఞ, అది క్రొత్త ఆజ్ఞ అని తానే చెప్తున్నాడు. ఎందుకు దీనిని క్రొత్త ఆజ్ఞ అంటున్నాడు అంటే

1) ఇది నూతనంగా క్రీస్తు చేత ఆమోదించబడి, నూతన నిబంధన క్రింద ఆజ్ఞాపించబడింది.

2) ఇది "నేను మిమ్మును ప్రేమించిన ప్రకారము" అనే నూతన హేతువు చేత అమలుపరచబడింది.

3) ఇది "అక్షరానుసారమైన ప్రాచీనస్థితి గలవారికి కాక ఆత్మానుసారమైన నవీనస్థితి గలవారికి (రోమా 7:6; parpaphrase added)" ఆజ్ఞాపించబడింది.

పాతనిబంధన లోని ఆజ్ఞలు ఒకరిని ఒకరు ప్రేమించుకొనుట అనే సూత్రాన్నే ఆజ్ఞాపించినప్పటికీ, మనం చెప్పుకున్న ఈ మూడు కారణాలను బట్టి ఈ ఆజ్ఞను "క్రొత్త ఆజ్ఞ" అని పిలవటం జరిగింది. అయితే యోహాను, ఈ ఆజ్ఞ గురించి మాట్లాడుతూ ఇది క్రీస్తు ప్రభువు వారి సమయం నుండి అమలతో ఉంది అని, క్రీస్తు శిష్యులకు ఇది ఆజ్ఞాపించబడింది గనుక, ఈ ఆజ్ఞను పాటిస్తూ ఒకరిని ఒకరు ప్రేమించుకోవాలని ప్రోత్సహించాడు.

ఈ ఉత్తరం ఎవరికి రాయబడిందో అనే విషయంలో రెండు ప్రాముఖ్యమైన వాదనలు ఉన్నాయి గనుక, యోహాను ప్రోత్సహిస్తుంది ఒక కుటుంబాన్ని లేదా ఒక సంఘాన్ని అయ్యుండొచ్చు. అయితే ఇక్కడ యూహను ఒక సంఘాన్ని ప్రోత్సహిస్తున్నాడు అనే వాదన నా మట్టుకు అంగీకార యోగ్యంగా ఉంది. దీనికి ఒక బలమైన కారణం ౩వ యోహాను పత్రిక. ఒకవేళ యోహాను నిజంగా ఒక వ్యక్తికి ఈ పత్రిక రాసుంటే, ౩వ యోహాను పత్రికలో వారి పేర్లు సంబోధించినట్టు, ఈ పత్రికలో కూడా సంబోదించి ఉండొచ్చు. ఆ విధంగా చేయలేదు. యోహాను రాసిన మూడు పత్రికలూ ఒకే సమయంలో రాయబడ్డయి అని బైబిల్ పండితులు వివిధ కారణాలను బట్టి ప్రతిపాదించారు. ఒకే సమయంలో రాయబడిన పత్రికలైనప్పుడు, ౩వ యోహాను పత్రికలో పేరుపెట్టి పత్రిక అందుకున్నవారిని సంబోధించి, 2 వ యోహాను పత్రికలో పేరుపెట్టి సంబోదించకపోవడం, ఈ పత్రిక నిజంగా ఒక వ్యక్తికే రాశాడా అనే సందేహాన్ని పుట్టిస్తుంది.

“మనమాయన ఆజ్ఞలప్రకారము నడుచుటయే ప్రేమ; మీరు మొదటనుండి వినిన ప్రకారము ప్రేమలో నడుచుకొనవలెను అనునదియే ఆ ఆజ్ఞ." 2 యోహాను 1:6

ఇక్కడ రెండు విషయాలను మనం గమనించగలం:

1) ఒకరిని ఒకరు ప్రేమించుకోవడం అనేది దేవుని ఆజ్ఞ

2) దేవుని ఆజ్ఞల ప్రకారం నడవడం ద్వారా మనం దేవుని ప్రేమిస్తున్నాం అని నిరూపించబడుతుంది

దేవుని (యేసు క్రీస్తుని) ప్రేమించేవారు ఆయన ఆజ్ఞలను గైకొంటారు. ఎవరైనా దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అని చెప్పుకుంటూ ఆయన ఆజ్ఞలను గైకొనకపోతే (లేదా) గైకొనాలనే ఆశ లేకపోతే వారు నిజంగా దేవుని ప్రేమించట్లేదు అని దేవుని వాక్యం చాలా స్పష్టంగా చెప్తుంది.

“మీరు నన్ను ప్రేమించిన యెడల నా ఆజ్ఞలను గైకొందురు." యోహాను 14:15

“నన్ను ప్రేమింపని వాడు నా మాటలు గైకొనడు; మీరు వినుచున్న మాట నామాట కాదు, నన్ను పంపిన తండ్రిదే." యోహాను 14:24

“నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొనువాడే నన్ను ప్రేమించువాడు; నన్ను ప్రేమించువాడు నా తండ్రివలన ప్రేమింపబడును; నేనును వానిని ప్రేమించి, వానికి నన్ను కనబరచుకొందునని చెప్పెను" యోహాను 14:21

“నేను మీ కాజ్ఞాపించువాటిని చేసిన యెడల, మీరు నా స్నేహితులై యుందురు" యోహాను 15:14

యేసు క్రీస్తు ప్రభువు మనకు మొదటినుండి ఇచ్చిన ఆజ్ఞలను బట్టి నడుచుకోవడం మనం ఆయనను ప్రేమిస్తున్నాం అనేదానికి రుజువుగా ఉంది. అసలు ఆయన ఇచ్చిన ఆజ్ఞలు ఏంటి అని మనం పరిశీలిస్తే, ఈ రెండు ఆజ్ఞలు మనకి కనబడతాయి.

“బోధకుడా, ధర్మ శాస్త్రములో ముఖ్యమైన ఆజ్ఞ ఏదని అడిగెను. అందుకాయన నీ పూర్ణహృదయముతోను నీ పూర్ణాత్మతోను నీ పూర్ణమనస్సుతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింప వలెననునదియే. ఇది ముఖ్యమైనదియు మొదటిదియునైన ఆజ్ఞ. నిన్నువలె నీ పొరుగువాని ప్రేమింపవలెనను రెండవ ఆజ్ఞయు దానివంటిదే. ఈ రెండు ఆజ్ఞలు ధర్మశాస్త్రమంతటికిని ప్రవక్తలకును ఆధారమై యున్నవని అతనితో చెప్పెను." మత్తయి 22:35-40

ఈ ఆజ్ఞలను బట్టి, దేవుడు మనకి ఏ ఇతర ఆజ్ఞ ఇవ్వలేదు అని అనుకోకూడదు. దేవుని వాక్యాన్ని చదివినప్పుడు అనేక ఆజ్ఞలు మనకి కనబడతాయి, ఉదాహరణకి: తల్లిదండ్రులకు పిల్లలు విధేయులుగా ఉండాలి, భార్య భర్తకి లోబడి ఉండాలి, సంఘ పెద్దలు మద్యపానీయస్తులై ఉండకూడదు మొదలగునవి. అయితే ఈ రెండు ఆజ్ఞలు దేవుడు మనకి ఇచ్చిన అన్ని ఆజ్ఞల యొక్క సారాంశం అని మనం గ్రహించాలి. కాబట్టి ప్రేమించడం అని ప్రభువు చెప్పినప్పుడు అది భావోద్వేగానికి చెందిన విషయంగా చెప్పబడలేదు గాని క్రియాశీలకమైనదిగా చూపించబడింది. నేను దేవుని ప్రేమిస్తున్నాను మరియు సహోదరులను ప్రేమిస్తున్నాను అని చెప్పేవారు వారి క్రియల ద్వారా దానిని నిరూపించబద్ధులై ఉన్నారు, లేని యెడల వారి మాటలు గాలికి చెదరగొట్టబడే పొట్టులాంటివి అని నిరూపించబడుతుంది.

“ఒకని నొకడు ప్రేమించుట విషయములో తప్ప మరేమియు ఎవనికిని అచ్చియుండవద్దు. పొరుగువానిని ప్రేమించువాడే ధర్మశాస్త్రము నెరవేర్చినవాడు. ఏలా గనగా వ్యభిచరింపవద్దు, నరహత్య చేయవద్దు, దొంగిలవద్దు, ఆశింపవద్దు, అనునవియు, మరి ఏ ఆజ్ఞయైన ఉన్న యెడల అదియు నిన్నువలె నీ పొరుగువాని ప్రేమింపవలెనను వాక్యములో సంక్షేపముగా ఇమిడియున్నవి." రోమా 13:8,9

“యేసుక్రీస్తు శరీరధారియై వచ్చెనని యొప్పుకొనని వంచకులు అనేకులు లోకములో బయలుదేరి యున్నారు." 2 యోహాను 1:7

యోహాను ఇప్పటివరకు, నిజమైన విశ్వాసుల ఎలా ఉంటారు/ఉండాలి అనే విషయాలు తెలియజేస్తే (వారు సత్యాన్ని ఎరిగిన వారు, సత్యాన్ని బట్టి నడుచుకుంటారు, దేవుని ప్రేమిస్తారు, దేవుని ఆజ్ఞలు గైకొంటారు) ఈ వచనం నుండి వంచకుల గురించి, మనం వారి బారిన పడకుండా మనల్ని మనం కాపాడుకోవడం గురించి చెప్తున్నాడు.

అబద్ధ ప్రవక్తల గురించి పేతురు ఈ విధంగా చెప్పాడు:

“మరియు అబద్ధప్రవక్తలు ప్రజలలో ఉండిరి. అటువలెనే మీలోను అబద్దబోధకులుందురు; వీరు తమ్మును కొనిన ప్రభువునుకూడ విసర్జించుచు, తమకుతామే శీఘ్రముగా నాశనము కలుగజేసికొనుచు, నాశనకరమగు భిన్నాభిప్రాయములను రహస్యముగా బోధించుదురు." 2 పేతురు 2:1

ఈ వంచకులలో అనేక రకాల వారు ఉన్నారు:

1) యేసు క్రీస్తు శరీరధారిగా రాలేదు అని చెప్పేవారు లేదా శరీరధారిగా రెండో సారి తిరిగి రాడు అనేవారు

2) యేసు క్రీస్తుకు దైవత్వము లేదు అని చెప్పేవారు

3) ఇవి రెండు ఒప్పుకున్నప్పటికీ, మోషే ధర్మశాస్త్రం లేకుండా నీతిమంతులు అవ్వరు అని వాదించేవారు

4) వాక్యాన్ని సరిగా విభజించకుండా, వాక్యంలో లేని అర్ధాలను భావాలను బోధించేవారు

యోహాను మొదటి రకం వంచకుల గురించి మాట్లాడుతున్నాడు. వీరు యేసుక్రీస్తు శరీరధారిగా రాలేదు అని నమ్మి దానినే బోధిస్తున్నారు. వీరిని గురించే యోహాను తన మొదటి పత్రికలో ఈ విధంగా రాసాడు:

“యేసుక్రీస్తు శరీరధారియై వచ్చెనని, యే ఆత్మ ఒప్పుకొనునో అది దేవుని సంబంధమైనది; యే ఆత్మ యేసును ఒప్పుకొనదో అది దేవుని సంబంధమైనది కాదు." 1 యోహాను 4:2

యేసు క్రీస్తు శరీరధారిగా రాకపోయుంటే ఎవరికీ రక్షణ ఉండేది కాదు. ఎందుకంటే ప్రభువు శరీరధారి కాకుండా కృపాసత్యసంపూర్ణుడు అవ్వడం అసాధ్యం. యేసు క్రీస్తు పాపుల పక్షాన మరణించి తిరిగి లేవకపోతే, మనం దేవుని కృపను పొందుకునేవారం కాదు, అదేవిధంగా దేవుడు పాపాన్ని శిక్షించకుండా మనల్ని క్షమిస్తే ఆయన సత్యవంతుడు అయ్యేవాడు కాదు. అందుకే అపొస్తలులు, యేసు క్రీస్తు శరీరధారిగా వచ్చాడు అని చాలా కచ్చితంగా చెప్పారు.

ఆ వాక్యము శరీరధారియై, కృపాసత్యసంపూర్ణుడుగా మనమధ్య నివసించెను; తండ్రివలన కలిగిన అద్వితీయకుమారుని మహిమవలె మనము ఆయన మహిమను కనుగొంటిమి." యోహాను 1:14

“నిరాక్షేపముగా దైవభక్తిని గూర్చిన మర్మము గొప్పదైయున్నది; ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యెను. ఆత్మవిషయమున నీతిపరుడని తీర్పునొందెను దేవదూతలకు కనబడెను రక్షకుడని జనములలో ప్రకటింపబడెను లోకమందు నమ్మబడెను ఆరోహణుడై తేజోమయుడయ్యెను."1 తిమోతి 3:16

యేసుక్రీస్తు, శరీరమునుబట్టి దావీదు సంతానముగాను, మృతులలోనుండి పునరుత్థానుడైనందున పరిశుద్ధమైన ఆత్మనుబట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూ పింపబడెను." రోమా 1:5

“కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణముయొక్క బలముగలవానిని, అనగా అపవాదిని మరణముద్వారా నశింపజేయుటకును.......ఆయనకూడ రక్తమాంసములలో పాలివాడాయెను. ఏలయనగా ఆయన ఎంతమాత్రమును దేవదూతల స్వభావమును ధరించుకొనక, అబ్రాహాము సంతాన స్వభావమును ధరించుకొనియున్నాడు."హెబ్రీ 2:14-16

ఈ వంచకుల గురించే యోహాను తన మొదటి పత్రికలో ఈ విధంగా చెప్పాడు:

“చిన్న పిల్లలారా, యిది కడవరి గడియ. క్రీస్తు విరోధి వచ్చునని వింటిరి గదా ఇప్పుడును అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరియున్నారు; ఇది కడవరి గడియ అని దీనిచేత తెలిసికొనుచున్నాము. వారు మనలోనుండి బయలువెళ్లిరి గాని వారు మన సంబంధులు కారు; వారు మన సంబంధులైతే మనతో కూడ నిలిచియుందురు; (సత్యమునందు మనతోకూడా నిలిచి ఉందురు; paraphrase added)" 1 యోహాను 2:18,19

“అట్టివాడే వంచకుడును క్రీస్తు విరోధియునై యున్నాడు. మేము మీ మధ్యను నెరవేర్చిన కార్యములను చెడగొట్టుకొనక మీరు పూర్ణ ఫలము పొందునట్లు జాగ్రత్తగా చూచుకొనుడి." 2 యోహాను 1:8

ఆపోసలుల బోధను తిరస్కరించి, యేసు క్రీస్తు శరీరధారిగా రాలేదు అని చెప్పే వంచకులు ఉన్నారు గనుక వారికి దూరంగా ఉండమని యోహాను సూచిస్తున్నాడు. యేసు క్రీస్తు ప్రభువు దగ్గర యోహాను ఏది తెలుసుకున్నాడో, దానినే ఇక్కడ చెప్తున్నాడు.

“యేసు వారితో ఇట్లనెను ఎవడును మిమ్మును మోసపరచకుండ చూచుకొనుడి." మత్తయి 24:4

“అబద్ధ ప్రవక్తలను గూర్చి జాగ్రత్తపడుడి. వారు గొఱ్ఱల చర్మములు వేసికొని మీయొద్దకు వత్తురు కాని లోపల వారు క్రూరమైన తోడేళ్లు." మత్తయి 7:15

ఇలాంటి వంచకుల బోధకు తావివ్వడం, అపొస్తలులు వారి మధ్యన నెరవేర్చిన కార్యాలను చెడగొట్టుకోవడమే అని యోహాను చెప్తున్నాడు. ఇక్కడ యోహాను ఏ కార్యాల గురించి మాటాడుతున్నాడు? కొంతమంది బైబిల్ పండితులు మరియు వ్యాఖ్యానకర్తలు, "విశ్వాసం" అనే కార్యం గురించి యోహాను మాట్లాడుతున్నాడు అని చెప్తారు. వంచకుల బోధను వినడం మరియు దానికి అంగీకరించడం ద్వారా రక్షణను కోల్పోయే అవకాశం ఉంది అని వారి ఉద్దేశం. దీనికి భిన్నంగా, యోహాను సువార్తలో, యేసు క్రీస్తు ప్రభువు మాట్లాడిన మాటలను మనం గమనిస్తే, తన గొర్రెల గురించి మాట్లాడుతూ "నేను వాటికి నిత్యజీవమునిచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికిని నశింపవు, ఎవడును వాటిని నా చేతిలోనుండి అపహరింపడు." అని చెప్తున్నాడు.

రక్షణ నిత్యమైనది అని, రక్షించబడిన వారు ఏ విధము చేతనైన వారి రక్షణను కోల్పోరు అనే ప్రభువు మాటలాడు తన సువార్తలో భద్రపరిచిన యోహానే ఈ పత్రికలో రక్షణ పోతుంది అని చెప్పాడు అనుకోవడం సమంజసం కాదు. అయితే యోహాను ఏ విషయం గురించి మాట్లాడుతున్నాడు అని ఆలోచన చేస్తే, "నిజమైన విశ్వాసులు ఈ వంచకుల బోధలను ఖండించక పోవడం వల్ల, యోహాను మరియు తనతోటి వారు ఆ ప్రాంతంలో జరిగించిన సువార్త పరిచర్యకు తీవ్ర నష్టం కలుగుతుంది అని" అంత మాత్రమే కాకుండా, "ఈ పత్రికను స్వీకరించిన వారు ఎవరైనా ఈ అబద్ద బోధకు చోటిచ్చి అందులోనే కొనసాగితే వారికి నిజమైన రక్షణ లేదు" అనే భావంలో చెప్పబడింది.

అయితే ఇలా ఆ అబద్ధ బోధని ఈ పత్రిక అందుకున్న వారు అంగీకరించే స్థితిలో ఉన్నారు అని యోహాను చెప్పట్లేదు. ఈ పత్రిక అందుకున్న వారిని నిజమైన విశ్వాసులుగా యోహాను పరిగణించాడు. పౌలు తాను పత్రిక రాసిన గలతి సంఘానికి ఈ విధంగా చెప్పాడు:

“మీ విషయమై నేను పడిన కష్టము వ్యర్థమై పోవునేమో అని మిమ్మును గూర్చి భయపడుచున్నాను." గలతీ 4:11

అయితే ఇలాంటి భయాన్ని ఇక్కడ యోహాను వ్యక్తపరచట్లేదు, దీనిని బట్టి యోహాను రాస్తున్న మాటలు నిజమైన విశ్వాసులకి (ఈ పత్రిక అందుకున్న వారికి) హెచ్చరికగా మరియు ప్రోత్సాహకరంగా ఉండడానికే రాసాడు అని అర్థంచేసుకోవచ్చు.

ఈ వచనంలో "మీరు పూర్ణ ఫలము పొందునట్లు జాగ్రత్తగా చూచుకొనుడి" అనే మాటని చూస్తున్నాం. ఏంటి ఈ పూర్ణ ఫలము, దేని గురించి మాట్లాడుతున్నాడు అని మనం ఆలోచన చేద్దాం.

దేవుని వాక్యంలో 5 కిరీటాలు గురించి ప్రస్తావించబడింది:

1) అక్షయమగు కిరీటం (1 కొరింథీ 9:25) - లోకాశలని జయించే వారికి, పాప విషయంలో తన శరీరాన్ని నాలుగగొట్టుకునే వారికి

2) అతిశయ కిరీటం (1 థెస్సలొ 2:19) - ఇతరులని రక్షణలోకి నడిపించేవారికి (దేవుని వాక్యాన్ని బోధించుటచేత, దేవుని మార్గంలో నడువుట చేత)

3) నీతి కిరీటం (2 తిమోతి 4:8) - మంచి పోరాటం పోరాడి, వారి పరుగు తుదముట్టించి, విశ్వాసం కాపాడుకున్నవారికి

4) జీవకిరీటం (యాకోబు 1:12) - క్రీస్తు కొరకు శోధనని జయించి, శ్రమను, మరణాన్ని సహించినవారికి

5) మహిమ కిరీటం (1 పేతురు 5:4) - నమ్మకమైన కాపరులకు, దేవుని సంఘాన్ని పైవిచారణ చేసేవారికి

ఇక్కడ యోహాను ఈ అబద్ధ బోధలో(యేసు క్రీస్తు శరీర దారిగా రాలేదు) పాలుపొందుకోవడం వల్ల వచ్చే పర్యవసానం గురించి మాట్లాడుతున్నాడు. వీరు " పూర్ణ ఫలము" పొందుకోలేరు అని చెప్తున్నాడు. ఒకవేళ ఎవరైనా ఈ అబద్ద బోధని నమ్మి, ఇప్పుడు నిలిచి ఉన్న స్థితిలోనుండి వెనకకు తిరిగితే, వారికి క్రీస్తు నీతి లేదని బాహాటంగా నిరూపించుకుంటూ, రక్షణకు మూలమైన క్రీస్తు సువార్తను బ్రష్టుపట్టించి ఇతరులను కూడా భ్రష్టత్వములోకి నడుపుతున్నారు. అందుకే యోహాను, "మీరు పూర్ణ ఫలము పొందునట్లు జాగ్రత్తగా చూచుకొనుడి" అని చెప్తున్నాడు, దీని ఉద్దేశం, యోహానుకు తాను సంబోధిస్తున్న వారు నిజమైన విశ్వాసులు అని కచ్చితంగా తెలుసు. వారు తన మాటలను అంగీకరించి ఈ అబద్ధ బోధకులను చేర్చుకొనక, పరిచర్యను ఆటంకపరచకుండా ఉంటారు అని అర్ధమవుతుంది. క్రీస్తు శరీరధారణని తిరస్కరించే వారు, రక్షణ లేని వారు, వారు తాము క్రీస్తు దాసులము అని చెప్పుకున్నప్పకి, ఎటువంటి కిరీటాన్ని దేవుని దగ్గర నుండి పొందుకోలేరు.

“క్రీస్తుబోధ యందు నిలిచియుండక దానిని విడిచి ముందునకుసాగు ప్రతివాడును దేవుని అంగీకరింపనివాడు; ఆ బోధయందు నిలిచియుండువాడు తండ్రిని కుమారుని అంగీకరించువాడు." 2 యోహాను 1:9

ఇక్కడ యోహాను రెండు వర్గాలకి చెందిన వారి గురించి మాట్లాడుతున్నాడు.

1) క్రీస్తు బోధయందు నిలిచి ఉండేవారు

2) క్రీస్తు బోధలో నిలిచి ఉండని వారు

నిజమైన విశ్వాసులు క్రీస్తు బోధలో నిలిచి ఉంటారు. యేసు క్రీస్తు ఈ విధంగా చెప్పాడు, "మీరు నా వాక్యమందు నిలిచినవారైతే నిజముగా నాకు శిష్యులై యుందురు" (యోహాను 8:31; paraphrase added). దీనిని బట్టి, నేను విశ్వసించాను అని చెప్పే ప్రతి ఒక్కరి విశ్వాసం నిజమైనది కాదు అని తెలుస్తుంది. అయితే ఎవరు, యేసు క్రీస్తు బోధలో నిలిచి ఉంటారో వారు మాత్రమే నిజమైన విశ్వాసులు/శిష్యులు. క్రీస్తు చేసిన బోధలో అనగా, ఆయన బోధించిన ప్రతి యొక్క మాట, ఆయన బోధ యొక్క సంపూర్ణ సారాంశం మన జీవితంలో కలిగి ఉండాలి. అయితే యోహాను ఇక్కడ ఒక సందర్భాన్ని బట్టి మాట్లాడుతున్నాడు, అది "యేసు క్రీస్తు శరీరధారిగా రాలేదు అనే అబద్ద బోధకుల గురించి మాట్లాడుతున్నాడు". గనుక ఇక్కడ క్రీస్తు బోధ అని యోహాను సంబోధించినప్పుడు అది "యేసు క్రీస్తు శరీరధారిగా రాలేదు" అని చెప్పే బోధ గురించి మాట్లాడుతున్నాడు. మనం ఇంతక ముందు చెప్పుకున్నట్టు, ఎవరైతే యేసు క్రీస్తు యొక్క శరీరధారణని తృణీకరిస్తారో వారు వంచకులు, కపట విశ్వాసులు, అబద్ద బోధకులు, మరియు క్రీస్తు బోధలో నిలిచి ఉండని వాడు అని మనం తెలుసుకోవాలి.

క్రీస్తు బోధలో నిలిచి ఉండని వారి గురించి యోహాను మాట్లాడుతూ, వారు క్రీస్తు బోధను "విడిచి ముందుకుసాగారు" అని చెప్తున్నాడు. అనగా వారు క్రీస్తు బోధనా పరిమితిని మించి ముందుకు వెళ్లారు. గ్రీకులు నమ్మే గ్నోస్టిసిజం అనే సిద్ధాంతంలో భౌతికమైనది అంతా చెడ్డది అని నమ్ముతారు. భౌతిక పదార్ధం అంతా చెడ్డది గనుక మానవ శరీరం కూడా చెడ్డది అని నమ్మేవారు. యేసు క్రీస్తు దేవుడైతే ఈ చెడ్డదైన, భౌతికమైన శరీరధారిగా వచ్చే అవకాశం లేదు అనేది వీరి వాదన. అయితే లేఖనాలు చాలా స్పష్టంగా యేసు క్రీస్తు శరీరధారిగా వచ్చాడు అని చెప్తున్నాయి. అంత మాత్రమే గాక, యేసు క్రీస్తు యొక్క శరీరం తండ్రి అయిన దేవుని చేత, పరిశుద్దాత్ముని శక్తిని బట్టి సిద్ధపరచబడింది అని, పాపస్వభావాన్ని కలిగియున్న సాధారణమై శరీరం కాదు అని గ్రహించాలి. గ్నోస్టిసిజం లాంటి వ్యర్ధమైన సిద్ధాంతాల్ని పట్టించుకోని వాక్యాన్ని పక్కన పెట్టి "క్రీస్తు శరీరధారిగా రాలేదు అని బోధించే వారు నిజంగా వంచకులు, క్రీస్తు బోధలో నిలువక, దానిని విడిచి వెళ్ళిపోయేవారు."

ప్రియా సహోదరుడు/సహోదరి, మరి నీ పరిస్థితి ఏంటి, నువ్వు యేసు క్రీస్తు బోధలో నిజంగా నిలిచి ఉన్నావా, లేదా నిలిచి ఉన్నాను అని నిన్ను నువ్వే మోసం చేసుకుంటున్నావా. ఒకసారి స్వపరిశీలన చేసుకో. ప్రభువు బోధలో నిలిచి ఉండు వారు మాత్రమే తండ్రిని మరియు కుమారుని కలిగి ఉన్నవారు.

“ఎవడైనను ఈ బోధను తేక మీ యొద్దకు వచ్చినయెడల వానిని మీ యింట చేర్చుకొనవద్దు; శుభమని వానితో చెప్పను వద్దు. శుభమని వానితో చెప్పువాడు వాని దుష్టక్రియలలో పాలివాడగును." 2 యోహాను 1:10,11

"శుభమని వానితో చెప్పువాడు వాని దుష్టక్రియలలో పాలివాడగును" అని యోహాను చెప్తున్నాడు. అసలు శుభమని చెప్పడం అంటే ఏంటో కొంచెం ఆలోచిద్దాం. "శుభమని చెప్పడం" అని యోహాను ప్రస్తావిస్తున్నది ఎదో పలకరింపు మాట గురించి కాదు అని ముందుగా మనం గ్రహించాలి. "శుభము" అని తెలుగులోకి అనువదించబడిన గ్రీకు మూల పదం "chaírō". ఈ పదం ఇదే పత్రికలో 4వ వచనంలో వాడబడింది. అక్కడ "నీ పిల్లలలో కొందరు సత్యమును అనుసరించి నడుచుచుండుట కనుగొని బహుగా సంతోషించుచున్నాను" అనే మాటని చూస్తున్నాం. "సంతోషించుచున్నాను" అని అనువదించబడిన గ్రీకు పదం "echarEn". ఈ పదానికి మూల పదం "chaírō".

యోహాను కొందరిని బట్టి సంతోషిస్తున్నాడు, అంటే వారు సత్యంలో నడుస్తున్నారు అని తెలుసుకొని వారి నడతని ఆమోదిస్తూ, వారి ప్రవర్తన పట్ల తన వైఖరిని (సంతోషాన్ని) కనబరుస్తున్నాడు. అదే విధంగా, ఎవరైనా "ఈ బోధను తేక మీ యొద్దకు వచ్చినయెడల" వారి ప్రవర్తనను, పనిని, పరిచర్యను, బోధను, మరియు ఆ వ్యక్తిని బట్టి మీరు సంతోషించవద్దు (chaírō). మీరు ఇలాంటి వారిని బట్టి సంతోషితున్నారు అంటే, దాని ఉద్దేశం మీరు కూడా వారి తప్పుబోధను, వారి పరిచర్యను ఆమోదిస్తూ, ప్రోత్సహిస్తున్నారు అని అర్ధం చేసుకోవాలి. నిజమైన విశ్వాసులు ఇలాంటి ప్రవర్తన కలిగి ఉండడానికి వీలులేదు, ఇలా ఉంటె అది వారి స్వభావాన్ని తెలియజేస్తూ, వారు క్రీస్తుకు సంబందించిన వారు కాదు అని రుజువు పరుస్తుంది.

అయితే ఏ విషయాన్ని యోహాను ఇంత తీవ్రంగా ఖండిస్తున్నాడు అంటే "ఎవడైనను ఈ బోధను తేక మీ యొద్దకు వచ్చినయెడల" అనే సమాధానాన్ని మనం గమనిస్తున్నాం. ఏ బోధ గురించి యోహాను మాట్లాడుతున్నాడు? అసలు ఎవరిగురించి మాట్లాడుతున్నాడు? ఈ వచ్చని ఒకసారి గమనిద్దాం:

“వారు మనలోనుండి బయలువెళ్లిరి గాని వారు మన సంబంధులు కారు; వారు మన సంబంధులైతే మనతో కూడ నిలిచియుందురు; అయితే వారందరు మన సంబంధులు కారని ప్రత్యక్ష పరచబడునట్లు వారు బయలువెళ్లిరి. " 1 యోహాను 2:19

ఎవరు వీరు అంటే, యోహాను రాసిన మొదటి పత్రికలో వీరు అబద్ధ బోధకులు అని, ఈ పత్రికలో (రెండవ పత్రికలో) వంచకులు అని సంబోధిస్తున్నాడు. వీరు క్రీస్తు సంబంధులు కారు, ఆలా కాదు అని వారు తమ క్రియలను బట్టి కనపరుస్తున్నారు.

అయితే ఇక్కడ యోహాను మొదటినుండి (ఈ పత్రికలో) మాట్లాడిన విషయమే చెప్తున్నాడు. ఎవరైతే క్రీస్తు శరీరధారిగా రాలేదు అని బోధిస్తున్నారో వారిని అసలు ఇంట్లోకి కూడా రానివ్వద్దు, అసలు వారిని శుభమని కూడా చెప్పవద్దు అంటున్నాడు. యోహాను చెప్పిన విధంగా మనం ప్రవర్తించినప్పుడే మనం యేసు క్రీస్తు బోధను, పరిచర్యను ప్రోత్సహిస్తున్నాము అని గ్రహించాలి. ఆలా కానీ యడల మనం అబద్ద బోధకులను, వంచకులనే పోషిస్తున్నాము. ఇక్కడ యేసు క్రీస్తు శరీరధారణని తృణీకరించడం మాత్రమే అబద్ధ బోధగా పరిగణించకూడదు. ఇక్కడ సందర్భాన్ని బట్టి ఈ ఒక్క విషయమే మాట్లాడినప్పటికీ, బైబిల్ లో లేని అర్ధాలను వాక్యంలోకి జొప్పించి చేసే ప్రతిబోధ అబద్ద బోధే. వీరిని మనం ప్రోత్సహహించకూడదు.

ప్రియా సహోదరుడు/సహోదరి, మరి నీ పరిస్థితి ఏంటి? నువ్వు ఎవరిని సమర్దిస్తున్నావు? దేనిని ప్రోత్సహాహిస్తున్నావు?

“అనేక సంగతులు మీకు వ్రాయవలసియుండియు సిరాతోను కాగితముతోను వ్రాయ మనస్సులేక మీ సంతోషము పరిపూర్ణమవునట్లు మిమ్మును కలిసికొని ముఖా ముఖిగా మాటలాడ నిరీక్షించుచున్నాను." 2 యోహాను 1:12

"అనేక సంగతులు మీకు వ్రాయవలసియుండియు" అని యోహాను చెప్తున్నాడు. దీనిని బట్టి ఈ పత్రికలో రాసిన విషయాలు అతి ప్రాముఖ్యమైనవని, ఆలస్యం చేసే అవకాశం లేదు అని అర్ధం అవుతుంది. ఈ విషయాలు మాత్రమే కాకుండా ఇతర విషయాలు కూడా యోహాను ఈ పత్రికని అందుకుంటున్న వారికి తెలియజేయాలి అనుకున్నాడు, అయితే అవి అంత అత్యవసరమైనవి కాదు గనుక, ఆ విషయాల గురించి "ముఖా ముఖిగా మాటలాడ నిరీక్షించుచున్నాను" అని యోహాను చెప్తున్నాడు. దీనిని బట్టి బైబిల్ లో సార్వత్రిక సంఘానికి అవసరమైన విషయాలు గ్రంథస్తం చేయబడలేదు అని చెప్పే వీలు లేదు. ఇందుకు భిన్నంగా ఇక్కడ యోహాను వ్యక్తిగత సహవాసం మరియు సంభాషణ గురించే మాట్లాడుతున్నాడు గాని దేవుని మాటలు కొన్నిటిని గ్రంథస్తం చేయకుండా నోటిమాటతో మాత్రమే చెప్పాడు అని అనుకోకూడదు.

“క్రీస్తు యేసునందుంచవలసిన విశ్వాసముద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధలేఖనములను బాల్యమునుండి నీ వెరుగుదువు."2 తిమోతి 3:15

“పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలెనని మిమ్మును వేడుకొనుచు మీకు వ్రాయవలసివచ్చెను."యూదా 1:3

పై రెండు వచనాలను మనం గమనిస్తే దేవుడు తన వాక్యాన్ని లిఖితపూర్వకంగా సంపూర్ణమైనదిగ మనకి అనుగ్రహించాడు అని తెలుస్తుంది.

సంఘాన్ని కలుసుకొని ముఖాముఖిగా మాట్లాడడం ద్వారా వారి "సంతోషము పరిపూర్ణమవుతుంది" అని యోహాను చెప్తున్నాడు. వారి సంతోషం పరిపూర్ణం అవ్వడం మాత్రమే కాకుండా అది యోహానుకు కూడా సంతోషాన్ని ఇస్తుంది అని అర్ధం చేసుకోవాలి. తోటి విశ్వాసులను కలుసుకోవడంలో సంతోషం ఉంది, అపొస్తలుడైన పౌలు రాసిన మాటల్లో: "నేను స్పెయిను దేశమునకు వెళ్లునప్పుడు మార్గములో మిమ్మును చూచి,మొదట మీ సహవాసమువలన కొంత మట్టుకు సంతృప్తిపొంది, మీచేత అక్కడికి సాగనంపబడుదునని నిరీక్షించుచున్నాను." రోమా15:24

తమ పరిచర్య ద్వారా రక్షణలోకి నడిపించబడిన విశ్వాసులకు దేవుని మాటలను బోధించడం ద్వారా వారి సంతోషం పరిపూర్ణమవుతుంది అని మనం అపొస్తలుల మాట్లల్లో చూడగలుగుతున్నాం.

ఇక్కడ అపొస్తలుడు "సిరాతోను కాగితముతోను వ్రాయ మనస్సులేక" అంటున్నాడు. ఇక్కడ "కాగితము" అని అనువదించబడిన గ్రీకు పదం "chartes" (pronounced khar'-tace). ఇక్కడ సంబోధించబడిన కాగితం, పాపిరస్ నుండి తయారైన ఆకు అని అర్ధం చేసుకోవాలి. పాపిరస్ మొక్కను పొరలు పొరలుగా అమర్చి నొక్కినప్పుడు అది ఒక షీట్ లాగ ఏర్పడుతుంది. ఇలాంటి షీట్స్ కొన్నింటిని కలిపి ఒక చుట్టగా చేసేవారు, దీనినే "గ్రంథము" అని ప్రకటన 5 వ అధ్యాయంలో అనువదించడం జరిగింది. " ఆ కాలంలో రాయడానికి ప్రధానంగా జంతువుల చర్మాన్ని వాడేవారు, అయితే పాపిరస్ కాగితాలు కొద్దిగా ప్రచురంలో ఉండేవి. "chartes" అని యోహాను వాడిన పదం కొత్త నిబంధనలో మరెక్కడా ఉపయోగించబడలేదు.

ఇక్కడ "సిరా" అని అనువదించబడిన పదం "melan". ఈ పదం "melas" అనే మూలా గ్రీకు పదం నుండి తీసుకోబడింది. "melas" "మెలస్" అంటే "నల్లని" అని అర్ధం. ఇక్కడ యోహాను ఆ కాలంలో ఉపయోగించే నల్లటి సిరా గురించి మాట్లాడుతున్నాడు.

“ఏర్పరచబడిన నీ సహోదరి పిల్లలు నీకు వందనములు చెప్పుచున్నారు." 2 యోహాను 1:13

కొందరు ఇక్కడ సంబోధించబడిన "సహోదరి" మరియు "పిల్లలు" నిజమైన వ్యక్తులు అని చెప్తారు. ఇంకొందరు ఇక్కడ యోహాను మరొక స్థానిక సంఘం గురించి సంబోధిస్తున్నాడు అని చెప్తారు. అయితే ఎందుకు "సహోదరి పిల్లలు" మాత్రమే వందనాలు చెప్తున్నారు? ఎందుకు తన సహోదరి తానే వందనాలు చెప్పట్లేదు? ఈ ప్రశ్నకు కొందరు, ఈ పత్రిక రాసిన సమయంలో ఆ సహోదరి మరణించిందని, తన పిల్లలు యోహానుతో పాటు ఉన్నారు గనుక వారు మాత్రమే వందనాలు తెలియజేస్తున్నారు అని ప్రతిపాదించారు. ఇలాంటి ప్రతిపాదనని అంగీకరించడానికంటే, మరి శ్రేష్టంగా, యోహాను "సహోదరి పిల్లలు" అని సంఘాన్ని సంబోధిస్తున్నాడు అని అర్ధం చేసుకోవడం మంచి అవగాహన అని చెప్పవచ్చు.

పేతురు కూడా తన పత్రికలో తానూ సంఘాన్ని ఈ విధంగా సంబోదించాడు. ఈ క్రింది వచనం మనం మాట్లాడుకున్న విషయానికి కొంతవరకు ఆధారం ఇస్తుంది:

"బబులోనులో మీవలె నేర్పరచబడిన ఆమెయు (అనగా సంఘము, paraphrase added), నా కుమారుడైన మార్కును, మీకు వందనములు చెప్పుచున్నారు." 1 పేతురు 5:13

దుర్బోధలకు సరైన సమాధానాలు కనెక్ట్ అవ్వండి

హితబోధ అనే ఈ వెబ్ సైట్ తెలుగు క్రైస్తవ జనులకు  ఆధ్యాత్మిక, అనుసరణీయ,  ప్రశ్నల నివృత్తిని కలిగించేలా నిర్మించబడినది.   అంతేగాక, దుర్బోధలకు ధీటైన సమాధానాలను మరియు జీవితంలో అనేక చిక్కు ప్రశ్నలకు సరైన సమాధానాలను అనేక ప్రఖ్యాతగాంచిన దైవజనుల చేత ఇప్పించడం జరిగింది.

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.